ఆలూరు రైతుల్లో అలజడి!
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:14 AM
పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం చేవేళ్ల మండలం ఆలూరు గ్రామంలో సాగు భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫిషన్ జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సాగులో ఉన్న వక్ఫ్ భూముల సేకరణకు నోటిఫికేషన్
భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా
తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన
చేవెళ్ల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం చేవేళ్ల మండలం ఆలూరు గ్రామంలో సాగు భూములను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫిషన్ జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పంటలు పండించుకుంటున్న భూములను తీసుకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలూరు-1, 2, 3 రెవెన్యూలో 1,248 ఎకరాల 22 గుంటల వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. వాటిని 360మందికి పైగా రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములను ఇండస్ట్రియల్ ఏర్పాటుకు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగులో ఉన్న రైతులకు 2016 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని ప్రకటించింది. అయితే రైతులు తమ భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం భూములు తీసుకోవాలంటే ఎకరాకు రూ.50 లక్షలు పరిహారంతో పాటు వెయ్యి గజాల ప్లాటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, మార్కెట్‌లో ఎకరం భూమి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయల ధర పలుకుతోంది. కొందరు రైతులు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, ఇతర అవసరాలకు వక్ఫ్ భూములను ఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇతరులకు నోటరీ ద్వారా అమ్ముకున్నారు. ఇలా కొన్న రైతులు కొందరు సాగు చేసుకుంటుండగా, మరికొందరు సాగు చేయకుండా వదిలేశారు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం వారి పేర్లు లేవు. అమ్మిన రైతుల పేర్లే ఉన్నాయి. భూములు కొన్న రైతులు తమకు పరిహారంకోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. భూములు కోల్పోతున్న రైతులతో సోమవారం చేవెళ్ల తహసీల్దార్ బీ కృష్ణయ్య సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు భూములపై ఎన్నేళ్లయినా రైతులకు పూర్తి హక్కులు ఉండవన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంలో సగం వక్ఫ్ బోర్డుకు, మరో సగం రైతులకు అందుతుందని స్పష్టం చేశారు. రైతులకు తగిన పరిహరం వస్తుందని, ఆందోళన చెందవద్దని సూచించారు. భూసేకరణకు సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఇక్కడ పారిశ్రామికవాడ ఏర్పాటుచేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు.

రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
రైతుల డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. ఎంజాయ్‌మెంట్ సర్వే చేసి భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటాం. షాబాద్ మండలం సీతారాంపురం తరహాలోనే రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆలూరులో గ్రామసభలు పెట్టి రైతుల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే భూములు తీసుకుంటాం. పారివ్రామికవాడతో ఆలూరు ప్రాంతం రూపురేఖలు మారిపోతాయి.
-పార్థసింహారెడ్డి, ఆర్డీవో చేవెళ్ల

ప్రభుత్వం ఎకరాకు 50 లక్షలు ఇవ్వాలి
ఆలూరులోని వక్ఫ్ బోర్డు భూముల్లో మా నాలుగు కుటుంబాలకు మొత్తం 80 ఎకరాలు ఉంది. మా తాతల కాలం నుంచి ఈ భూములను నమ్ముకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం మా భూములను తీసుకుంటుందని తెలిసి మా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వం ఎకరాకు రూ.50 లక్షలు పరిహారం ఇస్తేనే భూమిని వదులుకుంటాం.
-బర్ల బుచ్చయ్య, మాజీ ఎంపీటీసీ, ఆలూరు