సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఆన్‌లైన్‌లో విచారణకు హాజరు
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:33 AM
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11 అయిన హీరో అల్లు అర్జున్ ఆన్‌లైన్‌లో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ముంబయిలో ..
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11 అయిన హీరో అల్లు అర్జున్ ఆన్‌లైన్‌లో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం ముంబయిలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్న కారణంగా సోమవారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరిగిన విచారణలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. 500 పేజీల ఛార్జిషీటును సమర్పించారు. నలుగురు విచారణకు హాజరు కాకపోడంతో తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులందరూ ఒకేసారి విచారణకు హాజరైతేనే ఈ కేసు ట్రయల్ ప్రారంభకానుంది. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా 2024లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఒక బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటనలో కేసు నమోదయింది.