సంధ్య థియేటర్ కేసులో.. కోర్టుకు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరు
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:00 AM
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ సోమవారం వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్...
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీనటుడు అల్లు అర్జున్ సోమవారం వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ముంబైలో సినిమా షూటింగ్‌లో ఉన్నందున విచారణకు ప్రత్యక్షంగా హాజరుకాలేకపోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆబ్సెంట్ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఈ కేసు సోమవారం విచారణకు రాగా.. వీడియో కాల్ ద్వారా హాజరయ్యారు. ఈ కేసులోని నిందితులందరూ కోర్టుకుహాజరైతే తప్ప విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవటంతో తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మరో 12 మంది నిందితులు సోమవారం విచారణకు హాజరయ్యారు. 2024 డిసెంబరులో పుష్ప-2 సినిమా విడుదల సంధర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్దజరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.