Share News

రెరా అధికారి ప్రైవేటు దందా!

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:45 AM

రియల్‌ ఎస్టేట్‌ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటింగ్‌ అథారిటీ(రెరా)లోని ఓ అధికారి ప్రైవేటు సెటిల్‌మెంట్లు చేస్తూ ప్రజలను...

రెరా అధికారి ప్రైవేటు దందా!

  • ఫిర్యాదులు రిజిస్టర్‌ కాకుండానే వసూళ్ల పంచాయితీలు.. బిల్డర్లతో కలిసి బాధితులకు అన్యాయం

  • బిల్డర్లను హోటళ్లు, ఇళ్లకు పిలిచి సెటిల్‌మెంట్లు.. విచారణకు సింగిల్‌ బెంచ్‌ పెట్టాలని డిమాండ్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 21(ఆంధ్ర జ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటింగ్‌ అథారిటీ(రెరా)లోని ఓ అధికారి ప్రైవేటు సెటిల్‌మెంట్లు చేస్తూ ప్రజలను మోసం చేసిన కంపెనీలకే వంతపాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదులపై దర్యాప్తు చేయాల్సిన ఆ అధికారి.. సంబంధిత బిల్డర్లను పిలిపించి ప్రైవేటు పంచాయితీలు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రెరాలతో కొనుగోలుదారులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయిందని, మోసాలకు పాల్పడుతున్న సంస్థలకే ఇవి ఉపయోగపడుతున్నాయని ఇటీవల సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయినా కొందరు అధికారుల్లో మార్పు రావటం లేదు. రాష్ట్రంలో రెరా పరిధిలో ప్రస్తుతం 10,551 ప్రాజెక్టులు రిజిస్ర్టేషన్‌ చేసుకుని ఉన్నాయి. 4,853 మంది రిజిస్టర్‌ ఏజెంట్లు ఉన్నారు. రియల్‌ ఎస్టేట్‌ మోసాలపై వచ్చిన ఫిర్యాదులు 2,674 ఉన్నాయి.


ప్రైవేటు సెటిల్‌మెంట్లకే మొగ్గు

రెరాలోని ఓ వ్యక్తి గతంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ఓ శాఖలో పని చేశారు. పదవీ విరమణ అనంతరం ఆయన్ను అథారిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయన పనితీరుపై ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేయాలని వెళితే.. ఫిర్యాదు రిజిస్టర్‌ చేయకుండా మోసాలకు పాల్పడిన వారితో కార్యాలయం బయటే ప్రైవేటు సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. సెటిల్‌మెంట్‌ కోసం ప్రాజెక్టు స్థాయిని బట్టి ఆయన తక్కువలో తక్కువ రూ.కోటి డిమాండ్‌ చేస్తారని బిల్డర్లు చెబుతున్నారు. ఫిర్యాదు రాగానే సంబంధిత బిల్డర్‌ను హోటల్స్‌కు, ఇళ్లకు పిలిపించి సెటిల్‌మెంట్‌కు ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు. చట్టపరంగా వేసే శిక్ష కంటే సెటిల్‌మెంట్‌ కోసం ఆయన అడుగుతున్న మొత్తమే ఎక్కువగా ఉంటోందని ఓ బిల్డర్‌ తెలిపారు. ఇటీవల మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఓ బిల్డర్‌పై చీటర్‌ అనే ముద్ర వేసి.. ఆయన్ను సెటిల్‌మెంట్‌ కోసం బెదిరించడం చర్చనీయాంశమైంది. సెటిల్‌మెంట్‌ కోసం ఒత్తిడి చేయడం, సుమోటో కేసు నమోదు చేయిస్తానని బెదిరించడం, మధ్యవర్తుల ద్వారా పంచాయితీ చేయడం వంటివి ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రెరాలో పని చేసిన ఓ కీలక అధికారిపై ఏసీబీ అప్పట్లో దాడులు చేసింది. ఆయన వద్ద రూ.కోట్ల అక్రమాస్తులు బయటపడటంతో సంస్థ ప్రతిష్ట దెబ్బతింది. అదే కార్యాలయంలో ఉన్న మరో వ్యక్తి బిల్డర్ల ప్లానింగ్‌, డిజైన్లలోని లోపాలను తనకు అనుకూలంగా మార్చుకుని వసూళ్లకు పాల్పడుతున్నారని బిల్డర్లు ఆరోపిస్తున్నారు.


  • ‘రియల్‌’ సంస్థలకు రెరా షోకాజ్‌ నోటీసులు

  • రెరా రిజిస్ట్రేషన్‌ నెంబరు లేకుండా ప్రకటనలు ఇచ్చినందుకు చర్యలు

రెరా రిజిస్ట్రేషన్‌ నెంబరు లేకుండా చట్ట విరుద్ధమైన ప్రకటనలు జారీచేసిన పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు ‘తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ’(రెరా) శనివారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఇళ్లు, ప్లాట్లు, యూనిట్ల అమ్మకాల సందర్భంలో కొనుగోలుదారులను ఆకర్శించేందుకు జారీచేసే ప్రకటనలపై రెరా రిజిస్ట్రేషన్‌ నెంబరు లేకుండా మోసం చేయొద్దని ప్రమోటర్లు, డెవలపర్లు, బిల్డర్లు, ఏజెంట్లు, ప్రచార మాధ్యమాలను హెచ్చరించింది. రెరా రిజిస్ట్రేషన్‌ నెంబరును పొందుపర్చకుండా ప్రకటనలు జారీచేసిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, నవనామి ఎలివేట్‌ ప్రాజెక్టు, వర్టెక్స్‌ విరాట్‌ ప్రాజెక్టు, స్వర్గసీమ అమేయ ప్రాజెక్టు, తిరుమల హిల్స్‌ వంటివాటికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. మరికొన్ని సంస్థలు రెరా రిజిస్ట్రేషన్‌ నెంబరును పొందుపర్చినప్పటికీ... వాటి ప్రకటనలు రెరా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. స్వర్గసీమ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన అమేయ ప్రాజెక్టు ప్రకటనలో అక్షరాల సైజు, ప్రాజెక్టు పూర్తి పేరు, లేఔట్‌ రిజిస్ట్రేషన్‌లో లోపాలున్నాయని, దీనిని పూర్తి రెసిడెన్షియల్‌ ప్రాజెక్టుగా చూపిస్తూ కొనుగోలుదారులను తప్పుదోవ పట్టించిందని, అందుకే షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు పేర్కొంది.

Updated Date - Feb 22 , 2026 | 05:49 AM