Share News

వసంత పంచమికి కావాలొక స్లాటు!

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:42 AM

సంత పంచమి రోజు ఆస్తి కొనుగోలు చేస్తే శుభసూచకం అనే ఉద్దేశంతో ప్లాట్ల కొనుగోలుదారులు, వెంచర్‌ డెవలపర్లు ఇవాళ..

వసంత పంచమికి కావాలొక స్లాటు!

  • నేడు మంచిరోజని రిజిస్ట్రేషన్లకు పోటాపోటీ.. కోర్‌ అర్బన్‌ పరిధిలో మరీ ఎక్కువ..

  • 6,912 స్లాట్లు.. అన్నీ ఫుల్‌

  • అదనపు స్లాట్లకు డిమాండ్‌.. ఇవ్వలేమన్న అధికారులు

హైదరాబాద్‌, జనవరి 22(ఆంధ్ర జ్యోతి): వసంత పంచమి రోజు ఆస్తి కొనుగోలు చేస్తే శుభసూచకం అనే ఉద్దేశంతో ప్లాట్ల కొనుగోలుదారులు, వెంచర్‌ డెవలపర్లు ఇవాళ.. అంటే శుక్రవారం రిజిస్ట్రేషన్లకు ఎగబడుతున్నారు. సార్‌ ఒక్కస్లాటు ఇప్పించండి అంటూ ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి బతిమాలుకుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానం గత ఏడాది ఏప్రిల్‌ 10న అమల్లోకి వచ్చింది. దీని వల్ల అదనంగా 30 శాతం దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో పని వేళలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో దస్తావేజుకు 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయించారు. శుక్రవారానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్లన్నీ బుక్‌ అయ్యాయి. ప్రతి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు ఉంటాయి. ఇవే కాకుండా సాయంత్రం 5 గంటల తర్వాత మరో గంట పాటు ఐదు దస్తావేజులను స్లాట్‌ బుకింగ్‌తో సంబంధం లేకుండా వాకిన్‌ పద ్ధతిలో రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 6,912 స్లాట్లు ఉన్నాయి. వసంత పంచమి కావడంతో శుక్రవారం ఎక్కువ మంది స్లాట్‌ బుకింగ్‌ కోసం కార్యాలయాలకు పరుగులు తీశారు. డాక్యుమెంట్‌ రైటర్లకు ఎక్కువ మొత్తం కమిషన్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కోర్‌ అర్బన్‌ పరిధిలో స్లాట్ల కోసం ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది. ఈ ప్రాంతంలో 39 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా వాటి పరిధిలో ఉన్న స్లాట్లు 1872. వీటితోపాటు రంగారెడ్డి, నార్సింగ్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇంకో 336 స్లాట్లు అదనంగా ఉంటాయి. మొత్తం మీద కోర్‌ అర్బన్‌ ఏరియాలో 2,208 స్లాట్లు ఉన్నాయి. డిమాండ్‌కు తగినట్లు అధికారులు స్లాట్‌లు పెంచకపోవడం, కనీసం వాకిన్‌ ద్వారా అయినా సేల్‌ డీడ్‌లను అనుమతించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. సాంకేతికంగా అదనపు స్లాట్లు ఇవ్వలేమని స్పష్టం చేశారు. అదనపు స్లాట్లు ఇస్తే పనిఒత్తిడి పెరుగుతుందన్నారు. అయితే అవకాశం ఉన్న చోట వాకిన్‌ రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎవరూ నిరాశ చెందకుండా వీలైనంత మేర సేల్‌ డీడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 04:42 AM