All India Industrial Exhibition: అంతర్జాతీయ స్థాయికి నుమాయిష్
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:56 AM
ప్రపంచీకరణ నేపథ్యంలో ఆలిండియా పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి్‌ష)ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఇది భిన్న సంస్కృతులు, సంప్రదాయాల ప్రదర్శన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబుతో కలిసి నుమాయి్‌షను ప్రారంభించిన భట్టి
ఫిబ్రవరి 15 వరకు పారిశ్రామిక ప్రదర్శన
గోషామహల్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రపంచీకరణ నేపథ్యంలో ఆలిండియా పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి్‌ష)ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉన్నతమైన ఆలోచనలతో ప్రారంభమైన నుమాయి్‌షకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉందని తెలిపారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 85వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ నుమాయిష్ పరిశ్రమలకు సంబంధించినది మాత్రమే కాదని, వివిధ రాష్ట్రాలకు చెందిన భిన్న సంస్కృతులు, ఉత్పత్తుల కళానైపుణ్యం ప్రదర్శించే వేదిక అని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయంతో 19 విద్యా సంస్థలను నిర్వహి స్తున్న ఎగ్జిబిషన్ సొసైటీని భట్టి అభినందించారు. హైదరాబాద్‌కు మూసీనదిని మరో మణిహారంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ఏడాది 1,050 స్టాళ్లు
ఈ ఏడాది నుమాయి్‌షలో 1,050 స్టాళ్లు ఏర్పాటుచేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి అనేక సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఇక్కడ కొలువుదీరుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్టాళ్లను ఏర్పాటుచేసినట్లు వివరించారు. నుమాయి్‌షకు వచ్చేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని చెప్పారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. నుమాయి్‌షను ప్రజలంతా వినియోగించుకోవాలని సూచించారు.