Share News

అభ్యర్థులు వారే... స్టార్‌ క్యాంపెయినర్లూ వారే!

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:13 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో కొన్ని పార్టీల అభ్యర్థులు అన్నీ తామే అయ్యి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఇదివరకు ఏమాత్రం ఆదరణ లేని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌.....

అభ్యర్థులు వారే... స్టార్‌ క్యాంపెయినర్లూ వారే!

  • మునిసిపోల్స్‌లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థుల ఒంటరి పోరాటం

కరీంనగర్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి: మునిసిపల్‌ ఎన్నికల్లో కొన్ని పార్టీల అభ్యర్థులు అన్నీ తామే అయ్యి ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఇదివరకు ఏమాత్రం ఆదరణ లేని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎ్‌ఫబీ) పార్టీ నుంచి మునిసిపల్‌ ఎన్నికల్లో 500 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 37, నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో 15, రామగుండంలో 29 మంది ఏఐఎ్‌ఫబీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కరీంనగర్‌ జిల్లాలోని 12 మునిసిపాలిటీల్లో 467 డివిజన్లు ఉండగా, 131 డివిజన్లలో ఈ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీల్లో 49 మంది పోటీ పడుతున్నారు. ఈపార్టీకి రాజకీయ పార్టీగా గుర్తింపు ఉండటంతో అభ్యర్థులకు సింహం గుర్తు కేటాయించారు. ఈ పార్టీ తరఫున పోటీలో ఉన్నవారిలో చాలామంది ప్రధాన పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడ్డవారేనని సమాచారం. వీరంతా ఫార్వర్డ్‌ బ్లాక్‌ ఎన్నికల గుర్తు కోసమే ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీకి ఇచ్చిన సింహం గుర్తును ఓటర్లు తేలిగ్గా గుర్తుపడతారు. బ్యాలెట్‌ పేపర్‌లో అది తొలి నాలుగైదు స్థానాల్లోనే ఉంటుంది. అందుకే రెబల్స్‌, ఇతరులు ఈ పార్టీని ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన పార్టీలకు ఉన్నట్లుగా వీరికి స్టార్‌ క్యాంపెయినర్లు లేరు. ఎవరికి వారే స్టార్‌ క్యాంపెయినర్లుగా ప్రచారం చేసుకుంటూ సింహం గుర్తుకు ఓటేయాలని ఓటర్లను వేడుకుంటున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 02:13 AM