Share News

రూ.1800కోట్లతో ‘అలైన్‌’ తయారీ కేంద్రం

ABN , Publish Date - May 22 , 2026 | 04:18 AM

ప్రఖ్యాత మెడికల్‌ డివైస్‌ సంస్థ అలైన్‌ టెక్నాలజీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. సుమారు రూ.1,800కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ...

రూ.1800కోట్లతో ‘అలైన్‌’ తయారీ కేంద్రం

  • ప్రపంచ స్థాయి లైఫ్‌ సైన్సెస్‌ కేంద్రంగా హైదరాబాద్‌

  • తెలంగాణపై నమ్మకానికి ఇదే నిదర్శనం: మంత్రి దుద్దిళ్ల

  • అలైన్‌ టెక్నాలజీ, ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం

హైదరాబాద్‌, మే 21(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత మెడికల్‌ డివైస్‌ సంస్థ అలైన్‌ టెక్నాలజీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. సుమారు రూ.1,800కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే అలైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ పేరుతో కంపెనీ తన కార్యాకలాపాలను నిర్వహిస్తుండగా.. దానికి అనుబంధంగా ఈ కొత్త కేంద్రం పనిచేయనుంది. ఈ మేరకు సంస్థ తరఫున సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జిట్సే మర్రీ.. ప్రభుత్వం తరఫున తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ సీఈవో సర్వేష్‌ సింగ్‌ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమై హైదరాబాద్‌లో తయారీ కేంద్ర స్థాపనకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మెడ్‌టెక్‌, లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో ప్రపంచ సంస్థలకు తెలంగాణపై ఉన్న నమ్మకానికి.. ఈ పెట్టుబడే నిదర్శనమన్నారు. కొత్త ప్రాజెక్టు ద్వారా 300మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. 2027లో ఈ తయారీ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. భారీ స్థాయి 3డీ ప్రింటింగ్‌, ఆధునిక తయారీ వ్యవస్థలు, అత్యాధునిక డిజిటల్‌ సాంకేతికతతో ఈ యూనిట్‌ పనిచేయనున్నట్లు వివరించింది.

Updated Date - May 22 , 2026 | 04:18 AM