Alcoholic Beverage Industry: 3,900 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించండి
ABN , Publish Date - Jan 15 , 2026 | 06:24 AM
ఆల్కహాలిక్ బేవరేజెస్ (ఆల్కోబెవ్) రంగానికి సంబంధించి దీర్ఘకాలికంగా బకాయిపడ్డ రూ.3900 కోట్లను తక్షణమే చెల్లించాలని ఆయా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
ప్రభుత్వానికి ఆల్కోబెవ్ పరిశ్రమల ప్రతినిధుల డిమాండ్
హైదరాబాద్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : ఆల్కహాలిక్ బేవరేజెస్ (ఆల్కోబెవ్) రంగానికి సంబంధించి దీర్ఘకాలికంగా బకాయిపడ్డ రూ.3900 కోట్లను తక్షణమే చెల్లించాలని ఆయా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) డైరెక్టర్ జనరల్ వినోద్‌గిరి, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎ్‌సడబ్ల్యూఏఐ) సీఈఓ సంజిత్ పాధి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) డైరెక్టర్ జనరల్ అనంత్ అయ్యర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెలాఖరులో వరల్డ్ ఎకనమిక్ ఫోరం 56వ వార్షిక సమావేశం నేపథ్యంలో ప్రభుత్వం ఆల్కోబెవ్‌కు చెందిన బకాయిలు చెల్లించాలన్నారు. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఆల్కోబెవ్ సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయి రూ.3,900 కోట్లు దాటాయని. వీటిలో రూ.900 కోట్లు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. గత పదేళ్లలో రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం నాలుగు రెట్లు పెరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్ర విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరించారు.