ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు నాణ్యత!
ABN , Publish Date - Feb 12 , 2026 | 02:36 AM
హైదరాబాద్‌లో గత నెల రోజుల్లో వాయు నాణ్యత సూచి అనారోగ్య కేటగిరిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
గత నెల రోజుల్లో ‘అనారోగ్య’ స్థాయి సూచి
ఉదయం 6నుంచి 10లోపే అధిక కాలుష్య నమోదు
హైదరాబాద్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో గత నెల రోజుల్లో వాయు నాణ్యత సూచి అనారోగ్య కేటగిరిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ట్రాఫిక్ పెరుగుదల, భవన నిర్మాణ పనులు, చెత్తా చెదారం, మురుగు, పరిశ్రమల ఉద్గారాలు వంటి కారణాలతో కాలుష్య తీవ్రత పెరుగుతూ వస్తోందని వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) ఇండెక్స్ గణాంకాలు చెబుతున్నాయి. గాలిలో సూక్ష్మ ధూళి కణాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే దానికన్నా రెట్టింపుగా అంటే 82 నుంచి 88 మైక్రోగ్రాముల వరకు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో రోజుకు కనీసం 50లక్షల వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో ఉదయం 6 గంటల నుంచి 10 మధ్య వాయు కాలుష్యం అధికంగా నమోదవుతోంది. కేపీహెచ్‌బీ కాలనీలో ఇటీవల ఉదయం ఎనిమిదిన్నర సమయంలో ఏక్యూఐ 300 దాటి నమోదైంది. పారిశ్రామిక ప్రాంతమైన బొల్లారంలో ఏక్యూఐ 140కి మించినమోదైంది. ఏక్యూఐ 300 దాటడంతో ఇది రోజుకు 30 సిగరెట్లు కాల్చడంతో సమానమని, ఆ గాలి పీల్చిన వారికి పలు రకాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.