విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా
ABN , Publish Date - May 23 , 2026 | 04:53 AM
తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం ....
3 నెలల పదవీకాలం మిగిలి ఉండగానే..
ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యత పూర్తయిందనే ఈ నిర్ణయమని ప్రకటన
సీఎస్‌కు రాజీనామా లేఖ
హైదరాబాద్, మే 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం తన రాజీనామా లేఖను పంపించారు. ప్రభుత్వం తమకు అప్పగించిన విద్యా కమిషన్ సమగ్ర నివేదిక అందజేత పని పూర్తయినందున... పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా కమిషన్ చైర్మన్‌గా సేవలందించడానికి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజానికి, విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళి పదవీ కాలం ఈ సంవత్సరం సెప్టెంబరు 5 వరకు ఉంది. ఆకునూరి మురళిని చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం 2024 సెప్టెంబరు 6న జీఓ నెంబరు 1192ను జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారని ప్రకటించింది. కానీ, ఆ గడువుకు మూడున్నర నెలల ముందే మురళి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. విద్యా కమిషన్‌కు ఆకునూరి మురళి చైర్మన్ కాగా ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, చారగొండ వెంకటేశ్, కె.జ్యోత్స్యా శివారెడ్డి కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. విద్యా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ కమిషన్ చేసిన పలు సిఫారసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కమిషన్ చేసిన సిఫారసుల్లో ప్రధానంగా ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని సమీక్షించాలని చెప్పడం వివాదాస్పదంగా మారింది. వేతనాలను హేతుబద్ధీకరించాలని సిఫారసు చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అలాగే, ఇంటర్ బోర్డును రద్దు చేసి, 10, 11, 12 తరగతులను కలిపి పాఠశాల విద్యగా మార్చాలని సిఫారసు చేయడంపైనా విమర్శలొచ్చాయి. ఉత్తీర్ణతకు కనీస మార్కులను 35/40 శాతం నుంచి 45 శాతానికి మార్చాలంటూ సిఫారసు చేయడం విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపాడ్డారు.