అక్షయమే!
ABN , Publish Date - Apr 20 , 2026 | 05:49 AM
అక్షయ తృతీయ అంటేనే పసిడి కొనుగోళ్ల సందడి. బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందనే సెంటిమెంట్‌తో ప్రతిఏటా నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి.
కళ తప్పిన పసిడి మార్కెట్
ఆఫర్ల వర్షం కురిపించినా నిరాశే
గతేడాదితో పోలిస్తే సగానికి పడిపోయిన విక్రయాలు
హైదరాబాద్ సిటీ/రాంగోపాల్ పేట, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): అక్షయ తృతీయ అంటేనే పసిడి కొనుగోళ్ల సందడి. బంగారం కొంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందనే సెంటిమెంట్‌తో ప్రతిఏటా నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. కానీ, ఈ ఏడాది ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించలేదు. రికార్డుస్థాయి ధరలు కొనుగోలుదారులను దుకాణాలకు రాకుండా నిలువరించాయి. భారీ ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో వ్యాపారులు ప్రచారం చేసినా.. అవేవీ వినియోగదారుల మొహంలో ఆనందం నింపలేకపోయాయి. గతేడాది ఇదే పండగ రోజున ఒక్క హైదరాబాద్ నగర పరిధిలోనే సుమారు 100 నుంచి 150 కేజీల బంగారం విక్రయాలు జరిగాయి. కానీ, గతేడాదిలో పోలిస్తే విక్రయాలు దాదాపు సగానికి పడిపోయి.. 60 నుంచి 70 కేజీలకే పరిమితం అయిందంటున్నారు వ్యాపారులు. పసిడి ధరలు విపరీతంగా పెరగడంతో, అమ్మకాలు రూపాయల లెక్కలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. విలువ పరంగా గతేడాది కంటే 25-30శాతం అధికం. వ్యాపారపరంగా లాభసాటిగా కనిపించినా, తమ మార్జిన్లు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో.. అమ్మకాలు పెంచుకోవడానికి నగల దుకాణాల యజమానులు భారీ ఆఫర్లకు తెరలేపారు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధర, మేకింగ్ చార్జీలపై రాయితీలు, క్రెడిట్ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ నగరవాసులు, నగల దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేయడానికి బదులుగా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలలో కొనుగోళ్లకు మక్కువ చూపారు. ముఖ్యంగా తమ బడ్జెట్‌కు సరిపోయేలా ఒకగ్రాము, అరగ్రాము పరిమాణంలో చిన్నపాటి నాణేలను కొనేందుకు ఆసక్తి చూపారు.
ఈ క్విక్‌కామర్స్ సంస్థల ద్వారా జరిగిన బంగారం అమ్మకాల్లో ఏకంగా 40శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఇక కొత్త ఆభరణాల కొనుగోలు కోసం పాత బంగారం మార్పిడి చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఓ షోరూమ్ మేనేజర్ తెలిపారు. పాత బంగారంపై పూర్తి విలువను అందించడంతో పాటు కొన్ని షోరూమ్‌లు బోనస్ కూడా అందించడంతో ఈ అమ్మకాలు పెరిగాయని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 30శాతంకు పైగానే అధికంగా ఉందని చెప్పుకొచ్చారు. కాగా, జనరల్ బజార్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో అమ్మకాలు కనిపించినప్పటికీ, గతేడాదితో పోలిస్తే జోరు తగ్గిందని వ్యాపారులు అభిప్రాయపడ్డారు. సెంటిమెంట్ కోసం కొనేవారే తప్ప, పెట్టుబడి కోసం కొనేవారు తగ్గారని, వివాహాల కోసం కొనుగోళ్లు జరిపిన వారు కూడా తేలికపాటి ఆభరణాల కొనుగోళ్లకే ఆసక్తి చూపారని అంటున్నారు.