యోగి, రేవంత్ ఇద్దరి తీరు ఒకటే
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:00 AM
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరిది ఒకటే తీరని ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
యూపీలో మాదిరే తెలంగాణలోనూ బుల్డోజర్‌తో మసీదులు, దర్గాలు కూల్చుతున్నారు
ముస్లింల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కలుస్తాయ్
అందరు వేషాలు మార్చి మన మధ్యకు వస్తున్నారు
కేసీఆర్ అయినా.. రేవంత్ అయినా..మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లే: అక్బరుద్దీన్ ఒవైసీ
చార్మినార్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇద్దరిది ఒకటే తీరని ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. యూపీలో మాదిరే తెలంగాణలో కూడా సీఎం రేవంత్‌రెడ్డి బుల్డోజర్లతో మసీదులు, దర్గాలు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రెండేళ్లలో ఆరు మసీదులు, దర్గాలను కూల్చి వేశారన్నారు. తలాబ్‌కట్టలోని ఒవైసీ ఎక్సలెన్స్ పాఠశాలలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముస్లింల ప్రస్తావన వస్తే కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటవుతాయని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ యాభై వేల మత కల్లోలాల ద్వారా ముస్లింలకు నష్టం చేసిందన్నారు. బాబ్రీ మస్జీద్ కూల్చివేత, టాడా చట్టం ద్వారా అమాయక ముస్లింలను జైలుపాలు చేయడం, దేశంలో మత ఘర్షణలకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని ప్రశ్నించారు. అయినా కాంగ్రె్‌సకు క్షమించి మద్దత్తు ఇచ్చామని, కానీ ఆ పార్టీ నేతలు బీజేపీని భూచీగా చూపెట్టి ముస్లింల ఓట్లు తీసుకుంటున్నారే తప్ప ముస్లింల అభివృద్ధికి కృషి చేయడం లేదన్నారు. ముస్లింలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా అడిగేవారు లేరని బీజేపీ, కాంగ్రెస్ ఆలోచిస్తున్నాయని.. అక్బరుద్దీన్ బతికి ఉన్నంతవరకు ప్రభుత్వాలతో రాజీలేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ‘మోదీ, యోగి, రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి.. రావులు అందరు ఒక్కటే, అందరూ వేషాలు మార్చి మన మధ్యకు వస్తున్నారు. అందరూ మనల్ని ఇబ్బంది పెట్టేవారే, వారందరు ఒక్కటై ముస్లింలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. వారెవరూ ముస్లింల కోసం పని చేయరు, కానీ వారికీ ముస్లింల ఓట్లు మాత్రం కావాలి. వారికి ముస్లింల సమస్యలు ముఖ్యం కాదు’ అని విమర్శించారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు ఎందుకు మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. వేములవాడలో 800 ఏళ్ల నాటి దర్గాను ఎమ్మెల్యే కూల్చివేశారని, 2003లో ఆ ఎమ్మెల్యే అదే దర్గాలో ప్రార్థనలు నిర్వహించారని తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, బాన్సువాడ, జైనూర్‌లలో జరిగిన మత కల్లోలాల్లో ముస్లింల షాపులను ధ్వంసం చేసి లూటీ చేస్తే వారికీ నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు లోన్లు ఇవ్వడం లేదని, కారు, మోటర్ సైకిల్‌లు ఇస్తున్నామని ప్రకటిస్తున్నారే తప్ప నేటికీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ముస్లింలు ఇప్పటికైనా మేల్కొని తమ కోసం పోరాడుతున్న మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ముస్లింలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాలన్నారు.