Akbaruddin Owaisi Clarifies: దేశం ఏ ఒక్కరి అయ్య జాగీరు కాదు:అక్బరుద్దీన్
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:54 AM
భారతదేశం ఏ ఒక్కరి అయ్య జాగీరు కాదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. హిందు, ముస్లిం, సిక్కు.. ఇలా అన్ని మతాల వారినీ గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు.
భారతదేశం ఏ ఒక్కరి అయ్య జాగీరు కాదని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. హిందు, ముస్లిం, సిక్కు.. ఇలా అన్ని మతాల వారినీ గౌరవించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సర్ ప్రక్రియను తీవ్రంగా విమర్శించారు. కొత్త నిబంధనలు, సర్వేల పేరుతో ఓట్లను తొలగించి సామాన్య ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో తెలంగాణలోనూ ఓటర్ల జాబితా సవరణను అమలు చేయనున్నారని, బీహార్ తరహాలో రాష్ట్రంలో ఓట్ల తొలగింపు లేకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. పాక్, బంగ్లా దేశస్తులకు ఓటు హక్కు కల్పించాలని తాము చెప్పడం లేదని, అర్హులైన భారతీయ పౌరుల ఓట్లను తొలగించడాన్నే వ్యతిరేకిస్తున్నామని ఓవైసీ పునరుద్ఘాటించారు.
బీజేపీ అభ్యంతరం-సభలో వాగ్వాదం
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో బీహార్, యూపీ రాష్ట్రాల అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు. నకిలీ ఓట్లు తొలగించి, పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయడం కోసమే సవరణలు జరుగుతున్నాయని వివరించారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే సభలో చర్చ పెట్టి మాట్లాడాలని మహేశ్వర్ రెడ్డి సూచించారు.