ఓరుగల్లు కళాకారుడికి అరుదైన గౌరవం
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:52 AM
‘స్కైరూట్ ఎయిరో స్పేస్’ త్వరలో చేపట్టనున్న విక్రమ్-1 రాకెట్ ప్రయోగంతో ఓరుగల్లు కళాకారుడికి విశిష్ట గుర్తింపు లభించనుంది. వరంగల్‌కు చెందిన ప్రఖ్యాత సూక్ష్మశిల్పి మట్టెవాడ అజయ్‌కుమార్..
సూది రంధ్రం పరిమాణంలో దిగ్గజ శాస్త్రవేత్తల శిల్పాలు
విక్రమ్-1 రాకెట్‌తో అంతరిక్షంలోకి ప్రయాణం
హనుమకొండ కల్చరల్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ‘స్కైరూట్ ఎయిరో స్పేస్’ త్వరలో చేపట్టనున్న విక్రమ్-1 రాకెట్ ప్రయోగంతో ఓరుగల్లు కళాకారుడికి విశిష్ట గుర్తింపు లభించనుంది. వరంగల్‌కు చెందిన ప్రఖ్యాత సూక్ష్మశిల్పి మట్టెవాడ అజయ్‌కుమార్.. దేశానికి చెందిన విఖ్యాత శాస్త్రవేత్తలు సీవీ రామన్, విక్రమ్ సారాభాయి, ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ కళాఖండాలను రూపొందించగా, వాటిని హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఎయిరో స్పేస్ అంతరిక్షంలోకి పంపనుంది. ఈ శిల్పాలను సూది రంధ్రంలో, 800 మైక్రాన్ల (0.8 మిల్లీమీటర్లు) ఎత్తుతో ఆయన రూపొందించారు. మైక్రోస్కోప్ సాయంతోనే వీటిని చూడగలం. అజయ్ కుమార్ సూక్ష్మ శిల్పకళలో దిట్ట. అజయ్ కుమార్ ప్రతిభ గురించి తెలుసుకున్న స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో పవన్.. దేశ అంతరిక్ష రంగానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన శాస్త్రవేత్తల శిల్పాలను రూపొందిస్తే బావుంటుందని చెప్పగా.. 140గంటల పాటు శ్రమించి అజయ్‌కుమార్ ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. స్టెయిన్‌లె్‌స స్టీల్, 24 క్యారెట్ల బంగారం, వెండి, సిరామిక్ పొడి, కార్బన్ ఫైబర్ చూరను ఉపయోగించి వీటిని రూపొందించారు. అనంతరం 18 క్యారెట్ల బంగారంతో రూపొందించిన సూక్ష్మరాకెట్ నమూనా లోపల ఉంచి స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు అందించారు. దీన్ని ప్రత్యేకంగా రూపొందించిన రక్షిత పేలోడ్ హౌసింగ్‌లో అమర్చి విక్రమ్-1 రాకెట్ అంతరిక్ష యాత్రకు పంపనున్నారు. ఈ సందర్భంగా అజయ్‌కుమార్ మాట్లాడుతూ తాను రూపొందించిన ఈ సూక్ష్మ కళాఖండాలు అంతరిక్ష అన్వేషణ చరిత్రలో భాగం కావడం గర్వకారణంగా ఉందన్నారు. స్కైరూట్ ఎయిరోస్పేస్ సీఈవో వపన్ కుమార్, సహ వ్యవస్థాపకుడు నాగ భరత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.