ఏఐ ఫొటోలు.. ఫోర్జరీ సంతకాలతో..ఒకరి భూమి మరొకరికి!
ABN , Publish Date - May 02 , 2026 | 05:57 AM
ఈ ఫొటోలో మంచంపై ఉన్న వ్యక్తి పేరు గ్యార మల్లేశ్. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం. రెండేళ్లుగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతూ కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు.
భూ భారతిలో అక్రమంగా రిజిస్ట్రేషన్.. భూమి యజమానికి తెలియకుండానే మార్పు
వర్గల్‌లో ధరణి ఆపరేటర్ స్కాం
రెండేళ్లుగా మంచం పైనే బాధితుడు
కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదు
కోటి దాకా పలుకుతున్న భూమి విలువ
సిద్దిపేటకు చెందిన ఓ వ్యక్తి పాత్రపై అనుమానాలు
విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెల్లడయ్యే చాన్స్
సంగారెడ్డి, మే 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈ ఫొటోలో మంచంపై ఉన్న వ్యక్తి పేరు గ్యార మల్లేశ్. సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం. రెండేళ్లుగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతూ కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవల పరిస్థితి విషమించడంతో కీమో చికిత్సకు ఇతని శరీరం సహకరించడం లేదు. ఇలా మంచానికే పరిమితమైన మల్లేశ్‌కు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో ఎకరం భూమి ఉంది. అయితే ఈ భూమి ఇతనికి సంబంధం లేకుండానే ఈ ఏడాది మార్చి 4న మరో వ్యక్తి పేరుమీదికి మారింది. ఆ తర్వాత మార్చి 10న మరొకరి పేరిట రిజిస్ట్రేషన్ అయింది. క్యాన్సర్ చికిత్స కోసం భూమిని అమ్ముకుందామని చూసేసరికి విషయం బయటపడింది. మల్లేశ్ కనీసం ఫొటో దిగలేదు, సంతకం పెట్టలేదు, అసలు.. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లనేలేదు. అయినా.. రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అచ్చంగా మల్లేశ్ ఫొటోలు, సంతకాలను ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసేశారు.
ఏఐ టెక్నాలజీతో ఫోర్జరీ..!
గ్యార మల్లేశ్ పేరిట ఉన్న ఎకరం భూమిని వర్గల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీనివా్‌సరెడ్డి ఇతరుల పేరిట మార్చాడు. 2023లో గ్యార మల్లేశ్ ఈ భూమిని శ్రీమంతుల రామచంద్రం అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశాడు. ఈ ఎకరం భూమి విలువ ప్రస్తుతం రూ.కోటి దాకా పలుకుతోంది. అయితే 2026 మార్చి 4న గ్యార మల్లేశ్‌కు సంబంధం లేకుండానే టి.అభిలాష్ అనే వ్యక్తి పేరిట ఈ భూమి రిజిస్ట్రేషన్ జరిగింది. మళ్లీ అదే నెల 10వ తేదీన రేణుజ అనే మహిళ పేరిట భూమి బదిలీ అయింది. సాధారణంగా రిజిస్ట్రేషన్ జరగాలంటే క్రయవిక్రయదారులు ఇద్దరూ, సాక్షులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫొటోలు దిగి సంతకాలు పెట్టాలి. కానీ, మంచానికే పరిమితమైన మల్లేశ్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేదు. అయినా అతడు వచ్చినట్లుగా, సంతకం పెట్టినట్లుగా డాక్యుమెంట్ తయారు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. ఈ తతంగమంతా ఽభూ భారతి ఆపరేటర్ శ్రీనివా్‌సరెడ్డి కనుసన్నల్లో జరిగింది. బాధితుడు గ్యార మల్లేశ్ క్యాన్సర్ చికిత్స కోసం భూమిని అమ్మేందుకు ప్రయత్నించడంతో.. జరిగిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మల్లేశ్ బంధువులు జిలా కలెక్టర్‌కు, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా సదరు భూ భారతి ఆపరేటర్‌తోపాటు వర్గల్ తహసీల్దార్ పైనా కేసు నమోదు చేశారు.
ఆపరేటర్ వెనుక మరో వ్యక్తి..!
మల్లేశ్ భూమిని అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం వెనుక సిద్దిపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. ధరణి ఏజెన్సీతో సంబంధం ఉన్న ఆ వ్యక్తి సూచనలతోనే తాను రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఆపరేటర్ శ్రీనివా్‌సరెడ్డి అంగీకరించినట్లు సమాచారం. ధరణితోపాటు భూ భారతి పోర్టల్‌లోని లొసుగులపై ఆ వ్యక్తికి పూర్తి అవగాహన ఉందని చెప్పినట్లు తెలిసింది. అంతేకాదు.. రాష్ట్రంలోని చాలా మండలాల్లో ధరణి ఆపరేటర్లను నియమించింది ఆ వ్యక్తేనని సమాచారం. గత ప్రభుత్వంలో ధరణి ఆపరేటర్లుగా నియామకమైన వారంతా ప్రస్తుతం భూ భారతి ఆపరేటర్లుగా కొనసాగుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు ఇంకెన్ని జరిగాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు లోతుగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.
నన్ను బ్రతికించండి సార్
‘‘నాలుగో స్టేజీ క్యాన్సర్‌తో మంచానికే పరిమితమయ్యాను. నాకు ఇప్పటికే రూ.40 లక్షలు ఖర్చయ్యాయి. ఇంకా కావాలి. భూమి అమ్ముదామంటే నాకు తెలియకుండానే వేరేవాళ్లకు రిజిస్ట్రేషన్ చేశారు. నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నేను బతకాలంటే ఆ భూమి అమ్మితేనే నా చికిత్స ముందుకు సాగుతుంది. లేదంటే నాకు చావే గతి. నా కుటుంబం ఆగమవుతుంది. కలెక్టర్, పోలీసులు నాకు న్యాయం చేయాలి. మూడేళ్ల కిందట అప్పు చేసి రూ.27 లక్షలు పెట్టి భూమి కొన్నాను. నా భూమి నాకు దక్కేలా చేయండి’’
- గ్యార మల్లేశ్, క్యాన్సర్ బాధితుడు