Share News

Drone Technology: మేడారంలో ఏఐ

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:32 AM

మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహాజాతరకు కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.

Drone Technology: మేడారంలో ఏఐ

  • అత్యాధునిక డ్రోన్‌ వ్యవస్థతో నిఘా

  • సాంకేతిక నిఘాలో 13 వేల మంది విధులు

  • తప్పిపోయినవారిని గుర్తించే ఏర్పాట్లు

  • 12 బృందాలతో శాంతి భద్రతల పరిరక్షణ

ములుగు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహాజాతరకు కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీతో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సన్నద్ధమయ్యారు. ఇందు కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత డ్రోన్‌ వ్యవస్థ, జియో ట్యాగింగ్‌ ట్రాకింగ్‌ సిస్టంతో పాటు 13 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు, 12 క్రైం డిటెక్షన్‌ బృందాల సభ్యులు శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు. టీజీ క్వెస్ట్‌ పేరుతో అభివృద్ధి చేసిన ఏఐ ఎనేబుల్డ్‌ డ్రోన్‌ పోలీసింగ్‌ సిస్టమ్‌ను మేడారం మహాజాతరలో మొదటిసారి వినియోగించనున్నారు. ఈ డ్రోన్లు జన సమూహం, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ‘మేడారం 2.0’గా పిలుచుకునే ఈ వ్యవస్థలో నెక్స్ట్‌ జనరేషన్‌ ఏఐ ఎనలిటిక్స్‌, డ్రోన్‌ ఆధారిత సర్వైలెన్స్‌లను ఇంటిగ్రేట్‌ చేశారు. ఇవి జన సమూహంలో ఆకస్మిక రద్దీ, తొక్కిసలాట ప్రమాదాలు, ట్రాఫిక్‌ జామ్‌ వంటి సమస్యలను గుర్తించి అప్రమత్తం చేస్తాయి.

తప్పిపోయిన వారి జాడ కోసం..

మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు తప్పిపోతే వారి జాడను తెలుసుకునేందుకు వొడా ఫోన్‌, ఐడియాతో కలిసి పోలీసులు జియో ట్యాగ్‌ ఆధారిత ట్రాకింగ్‌ సిస్టమ్‌ను ప్రవేశ పెట్టారు. జాతరకు వచ్చే భక్తుల్లో పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు పస్రా, తాడ్వాయి మార్గాల్లో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ రిస్ట్‌ బ్యాండ్లు ఇవ్వనున్నారు. తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీని వీటిద్వారా గుర్తిస్తారు. ఈ విధానం శబరిమలలో విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. మహాజాతర కోసం పోలీసులు ఏర్పాటు చేస్తున్న టెక్నాలజీ సర్వైలైన్స్‌లో సుమారు 13 వేల మంది విధులు నిర్వర్తించనున్నారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా హీలియం బెలూన్లకు అమర్చిన పాన్‌ టిల్ట్‌ జూమ్‌ కెమెరాలు పరిశీలిస్తాయి. మేడారం మహాజాతరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 12 క్రైమ్‌ డిటెక్షన్‌ బృందాలను రంగంలోకి దింపనున్నారు. అలాగే పాత నేరస్థుల గుర్తింపునకు ఆస్పత్రి ప్రాంగణాలు, పార్కింగ్‌ స్థలాల వద్ద ఫేస్‌ రికగ్నైజేషన్‌ సాంకేతికతను వినియోగించనున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 02:33 AM