Share News

సర్‌ ప్రక్రియలో అక్రమాలకు అవకాశం ఇవ్వొద్దు

ABN , Publish Date - May 17 , 2026 | 06:03 AM

రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌.ఐ.ఆర్‌) ప్రక్రియపై ఏఐసీసీ క్షేత్రస్థాయిలో దృష్టి సారించింది.

సర్‌ ప్రక్రియలో అక్రమాలకు అవకాశం ఇవ్వొద్దు

  • పార్టీ శ్రేణులకు ఏఐసీసీ దిశానిర్దేశం

  • అప్రమత్తంగా ఉండాలని మీనాక్షి నటరాజన్‌ పిలుపు

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌.ఐ.ఆర్‌) ప్రక్రియపై ఏఐసీసీ క్షేత్రస్థాయిలో దృష్టి సారించింది. సర్‌ ప్రక్రియలో అక్రమాలకు తావు లేకుండా చూడాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జూమ్‌ సమావేశంలో.. ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్‌ సావంత్‌లు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్దఎత్తున ఓట్లను తొలగించే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బూత్‌ లెవల్‌ కమిటీలు పూర్తి బాధ్యత తీసుకోవాలని మీనాక్షి నటరాజన్‌ స్పష్టం చేశారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లకుండా, ఆఫీసుల్లోనే కూర్చొని ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. దీనిపై పార్టీపరంగా గట్టి నిఘా పెట్టాలని సూచించారు. పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బూత్‌స్థాయి అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అధికారులతో పాటు ఇంటింటి పరిశీలనలో పాల్గొనాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగిస్తే ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌ ద్వారా పై అధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రతి నియోజకవర్గ వారీగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అకారణంగా ఓటు కోల్పోయిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి కనీసం 3 నెలల సమయం ఇచ్చేలా ఎన్నికల కమిషన్‌, జిల్లా కలెక్టర్లకు పార్టీ తరఫున విజ్ఞప్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

సీనియర్లకు నామినేటెడ్‌ పదవుల్లో న్యాయం జరగాలి: మంత్రి కోమటిరెడ్డి

పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులకు నామినేటెడ్‌, కార్పొరేషన్‌ పదవుల్లో న్యాయం జరగాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదించగా.. దీనిపై మహేశ్‌కుమార్‌గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌ పూర్తి సానుకూలత వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి చెప్పింది నూరుశాతం నిజమని, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి అర్హులైన నాయకుల జాబితాను ఆయనే స్వయంగా తయారుచేసి ఇవ్వాలని ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్‌ సూచించారు. దీనిపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. ఉత్తమ్‌, జానారెడ్డిలతో చర్చించి త్వరలోనే ఒక సమగ్ర జాబితాను అందజేస్తామని ప్రకటించారు.

Updated Date - May 17 , 2026 | 06:03 AM