Share News

మెదడు కణితులకు బయటి నుంచే చికిత్స

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:39 AM

మెదడులో తలెత్తే కణితులను తొలగించడానికి పుర్రెను కత్తిరించి, మెదడును తెరిచి సర్జరీ చేస్తున్నారు. ఆ వైద్య ప్రక్రియకు స్వస్తి చెప్పే ఆధునిక యంత్రం....

మెదడు కణితులకు బయటి నుంచే చికిత్స

  • పుర్రెను కత్తిరించకుండానే రేడియేషన్‌తో వైద్యం

  • అందుబాటులోకి ‘జెడ్‌ఏపీ-ఎక్స్‌ గైరోస్కోపిక్‌ న్యూరో-రేడియో సర్జరీ ప్లాట్‌ఫామ్‌’

  • ఏఐజీ ఆస్పత్రిలో ప్రారంభించిన వైద్యమంత్రి రాజనర్సింహ

  • 30 నుంచి 45 నిమిషాల్లో చికిత్స: డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మెదడులో తలెత్తే కణితులను తొలగించడానికి పుర్రెను కత్తిరించి, మెదడును తెరిచి సర్జరీ చేస్తున్నారు. ఆ వైద్య ప్రక్రియకు స్వస్తి చెప్పే ఆధునిక యంత్రం ‘జెడ్‌ఏపీ-ఎక్స్‌ గైరోస్కోపిక్‌ న్యూరో-రేడియో సర్జరీ ప్లాట్‌ఫామ్‌’ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చింది. పుర్రెను కత్తిరించకుండానే మెదడులోని కణితులను రేడియేషన్‌ ద్వారా నిర్మూలించే ఈ యంత్రాన్ని శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ ఏఐజీ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ‘జెడ్‌ఏపీ-ఎక్స్‌ గైరోస్కోపిక్‌’ యంత్రం పనితీరును డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి వివరించారు. దక్షిణ భారతదేశంలోనే ఇది మొట్టమొదటిదని, దేశంలో రెండవదని.. మెదడు ట్యూమర్లు, క్లిష్టమైన న్యూరలాజికల్‌ వ్యాధుల చికిత్సలో కీలక మలుపని చెప్పారు. ఓపెన్‌ సర్జరీ అవసరం లేకుండా, కోతలు లేకుండా, డే-కేర్‌ విధానంలోనే మెదడు గాయాలు, కణితులకు చికిత్స చేయవచ్చన్నారు. ఈ యంత్రం సబ్‌-మిల్లీమీటర్‌ స్థాయి కచ్చితత్వంతో కేంద్రీకృత రేడియేషన్‌ కిరణాలను విడుదల చేస్తుందని, కణతులు, అసాధారణ కణజాలాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందని, ఆరోగ్యకరమైన మెదడు భాగాలకు ఎలాంటి నష్టం జరగదని తెలిపారు. రోగులు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ చికిత్స ద్వారా మెదడులో 10-20 సెంటీమీటర్ల సైజు ఉండే కణితులను కూడా తొలగించవచ్చన్నారు. సాధారణ ప్రక్రియలో 8 నుంచి 12 గంటల సమయం పట్టే శస్త్రచికిత్స.. ఈ ప్రక్రియలో కేవలం 30 నుంచి 45 నిమిషాల్లో పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. మంత్రి దామోదర మాట్లాడుతూ.. ప్రజా వైద్యానికి, ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ సమావేశంలో ప్రపంచ ప్రసిద్ధ న్యూరోసర్జన్‌, సైబర్‌నై్‌ఫ-జెడ్‌ఏపీ-ఎక్స్‌ ఆవిష్కర్త ప్రొఫెసర్‌ జాన్‌ ఆర్‌. అడ్లర్‌, డాక్టర్‌ సుబోధ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 04:39 AM