Share News

ఏఐ డేటాతో ఒక్కో రైతుకు రూ..50 వేలు ఆదా!

ABN , Publish Date - Aug 10 , 2026 | 06:02 AM

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాతావరణ అంచనాలతో తెలంగాణలోని సన్నకారు రైతులు భారీ ప్రయోజనం పొందారని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

ఏఐ డేటాతో ఒక్కో రైతుకు రూ..50 వేలు ఆదా!

  • వాతావరణ హెచ్చరికలతో తెలంగాణ రైతులకు ప్రయోజనం

  • ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాతావరణ అంచనాలతో తెలంగాణలోని సన్నకారు రైతులు భారీ ప్రయోజనం పొందారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. వాతావరణ పరిస్థితులకనుగుణంగా పంటల సాగు నిర్ణయం మార్చుకోవడంతో పెట్టుబడుల్లో కొందరు రైతులు గరిష్ఠంగా రూ.50 వేల పై చిలుకు (560 అమెరికా డాలర్లు) నికరంగా పొదుపు చేశారని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘వరల్డ్‌ డెవల్‌పమెంట్‌ రిపోర్ట్‌ 2026: ది ప్రామిస్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’లో తెలిపింది. మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 2025లో నిర్వహించిన అధ్యయనం ఆధారంగా రాష్ట్ర రైతులకు కలిగిన ప్రయోజనాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రభుత్వం, వ్యవసాయ విస్తరణ అధికారులు అందించే సమాచారంపై పెద్దగా ఆధారపడని చిన్న, సన్నకారు రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ సమాచారం ఉపయోగ పడిందని నివేదిక పేర్కొంది. వర్షాలు, వాతావరణ మార్పులు, ఇతర ప్రమాదాలపై ముందస్తు అంచనాలను తెలుసుకుని రైతులు తమ సాగు, పెట్టుబడి నిర్ణయాలను మార్చుకున్నారని తెలిపింది. నిర్దిష్ట వాతావరణ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని పంటల సాగుపై అన్నదాతలు తమ ఖర్చు మూడో వంతు పెంచితే, చాలా మంది రైతులు అనవసర ఖర్చు తగ్గించుకున్నారని ప్రపంచ బ్యాంకు నివేదించింది. కనుక అభివృద్ధి చెందుతున్న దేశాలు భారీ ఖర్చుతో కూడుకున్న ఏఐ మోడళ్ల కంటే తక్కువ ఖర్చుతో విస్తృతంగా ఉపయోగించే చిన్న, చౌక ఏఐ సాధనాలను అందుబాటులోకి తేవాలని సూచించింది.

Updated Date - Aug 10 , 2026 | 06:04 AM