Share News

‘ఏఐ’తో ఔషధ రంగంలో విప్లవాత్మక మార్పులు

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:24 AM

కృత్రిమ మేధతో (ఏఐ)తో ఔషధ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నట్టు ప్రముఖ వైద్య నిపుణులు, ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి అన్నారు.

‘ఏఐ’తో ఔషధ రంగంలో విప్లవాత్మక మార్పులు

  • వేగవంతమవుతున్న ఔషధ ఆవిష్కరణలు

  • తక్కువ ఖర్చుతోనే వ్యాధుల గుర్తింపు

  • ఏఐజీ హాస్పిటల్స్‌ సీఎండీ డా. నాగేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధతో (ఏఐ)తో ఔషధ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నట్టు ప్రముఖ వైద్య నిపుణులు, ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి అన్నారు. ఇక్ఫాయ్‌ యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ద ఫ్యూచర్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఔషధ ఆవిష్కరణకు గతంలో దశాబ్దాల సమయం పట్టేదని, ఇప్పుడు ఏఐ వినియోగంతో కేవలం కొన్ని సంవత్సరాల్లోనే అది సాధ్యపడుతున్నట్టు చెప్పారు. ఏఐ ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తేగలదని అన్నారు. ఏఐని వైద్య నిపుణుల స్థానాన్ని భర్తీచేేస సాధనంగా కాకుండా, వారికి సాయపడే టెక్నాలజీగానే చూడాలన్నారు. ఔషధ ఆవిష్కరణ, రేడియాలజీ, టెలీ మెడిసిన్‌, ప్రెసిషన్‌ మెడిసిన్‌, ప్రిడిక్టివ్‌ మెడిసిన్‌ (వ్యాధుల ముందస్తు అంచనా), జీనోమిక్స్‌, క్యాన్సర్‌ నిర్ధారణ, డెర్మటాలజీ, రిమోట్‌ పేషెంట్‌ మానిటరింగ్‌ను ఏఐ సంపూర్ణంగా మారుస్తున్నట్టు చెప్పారు.


‘మీరా’ రోబోతో వేగంగా కన్సల్టేషన్‌

ఏఐజీ ఆసుపత్రుల్లో వినియోగిస్తున్న ఏఐ ఆధారిత రోబో ‘మీరా’ గురించి డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది వైద్యులకు, నర్సులకు సాయపడటంతో పాటు, రోగుల ప్రశ్నలకు సత్వరమే సమాధానమిస్తూ, కన్సల్టేషన్‌ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్టు చెప్పారు. ఏఐ ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ‘ఐ-ేసవ్‌’ గురించి వివరిస్తూ, రోగి పరిస్థితి విషమించడానికి గంట ముందే వైద్యులను అప్రమత్తం చేయగలదన్నారు. తక్కువ ఖర్చుతో స్ర్కీనింగ్‌ చేయడానికి వీలు కల్పిస్తోందన్నారు. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా జాతీయ అభివృద్థికి దోహదపడటం ఉన్నత విద్యా సంస్థల బాధ్యత అని ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (ఐఎఫ్‌హెచ్‌ఈ) చాన్స్‌లర్‌ డాక్టర్‌ సి. రంగరాజన్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విద్యా, వైద్య రంగాలకు చెందిన నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

Updated Date - Jul 04 , 2026 | 06:25 AM