kumaram bheem asifabad-వీబీ జీరామ్‌జీ పనులపై ఏఐ నిఘా
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:54 PM
జిల్లాలో ఈ నెల నుంచి వీబీ జీరామ్‌జీ పథకం(వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్) పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంంది. పనుల నిర్వహణలో కృత్తిమ మేధ(ఏఐ) ఆధారిత సేవలను వినియోగిస్తున్నారు. బోగస్ పనులను నిరోధించి, నిజాయతీగా చేసిన కూలీలను గుర్తించేలా ఈ సాంకేతికతను ప్రవేశపెట్టారు.
- బోగస్ హాజరు.. రికార్డుల్లో అక్రమాలకు కళ్లెం
రెబ్బెన, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల నుంచి వీబీ జీరామ్‌జీ పథకం(వికసిత్ భారత్- గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్) పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంంది. పనుల నిర్వహణలో కృత్తిమ మేధ(ఏఐ) ఆధారిత సేవలను వినియోగిస్తున్నారు. బోగస్ పనులను నిరోధించి, నిజాయతీగా చేసిన కూలీలను గుర్తించేలా ఈ సాంకేతికతను ప్రవేశపెట్టారు. వీబీ జీరాంజీ పనుల్లో నకిలీ హాజరు లేకుండా ఇప్పటికే నేషన్ మొబైల్ మానిటరింగ్ యాప్‌లో ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. కూలీలు చేసిన పనులను గుర్తించేందుకు ఏఐని వినియోగిస్తున్నారు. ఉపాధి హామీ పనుల ప్రారంభంలోనే ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత కూలీల ఫొటోను అప్‌లోడ్ చేస్తారు. రోజు రెండు సార్లు ఫొటోలు తీస్తారు. మొదటి సారి తీశాక, మళ్లీ రెండో సారి నాలుగు గంటల తర్వాత హాజరు నమోదు చేస్తారు. రెండు స్లారు హాజరుతో కూలీలు పూర్తి స్థాయి పనులు చేయాల్సి ఉంటుంది.
- పథకం లక్ష్యం నేరవేరడంతో..
ఈ విధానం వల్ల పథకం లక్ష్యం నేరవేరడంతో పాటు కూలీల కష్టానికి సరిపడా వేతనం అందే వీలుటుంది. ఉదయం పనులు పూర్తి అయ్యాక తీసిన ఫొటోల్లో ఏఐ క్లౌడ్ సర్వర్ సెకన్లలో వ్యత్యాసాలను గుర్తిస్తోంది. మధ్యాహ్నం ఒకే విధంగా పనులు నిర్వహించ లేదని ఏఐ గుర్తించి మాస్టర్‌ను రద్దు చేయనుంది. దీంతో పారదర్శకంగా పనులు చేపడితేనే వేతనాలు కూలీలకు అందుతాయి. తప్పుడు బిల్లులు పెడితే శాటిలైట్ డ్రోన్ డేటాలోని వాస్తవ కొలతలను ఏఐ సాంకేతిక సరిపోల్చదు. దీంతో సదరు సిబ్బందిపై కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. ఎంబుక్ రాసే అధికారులపై నేరుగా విచారణ చేపట్టనున్నారు. ఇందుకు గానూ ప్రతి జిల్లా అంబుడ్స్‌మెన్‌కు డ్రోన్ నిఘా వ్యవస్థను కేటాయించారు. కూలీలు రాక పోయినా, పాత ఫొటోలను మళ్లీ అప్ లోడ్ చేసిన ఏఐ గుర్తించనుంది. ప్రస్తుతం జిల్లాలో 15 మండలాల్లో 336 గ్రామ పంచాయతీలుండగా, మొత్తం జాబ్ కార్డులు 1.23 లక్షలు, క్రియాశీలకమైనవి 86వేలు కాగా, మొత్తం కూలీలు 2.44 లక్షలు పని చేస్తున్నారు. ఇందులో క్రియాశీలకమైన వారు 1.57 లక్షలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతోంది. ఈ విషయమై డీఆర్‌డీవో దత్తారావును వివరణ కోరగా నిజాయితీ పని చేసే కూలీలకు సరిపడా వేతనాలు అందుతాయని చెప్పారు. నూతన సాంకేతికతతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో మస్టర్ల కొలతలు, పరిమాణం, ఒకరికి బదులు తప్పులు జరుగుతున్నట్టు గుర్తించామన్నారు ఏఐ టెక్నాలజీతో తప్పులు జరిగే అవకాశం ఉండదు.