ఏఐ.. నాగరికతలో పెద్ద మార్పు!
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:48 AM
కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు ఒక సాంకేతిక సాధనం మాత్రమే కాదని.. అది సమాజం, వ్యాపారం, జీవన విధానాలను ప్రభావితం చేసే నాగరికత మార్పుగా రూపాంతరం చెందుతోందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ .....
కృత్రిమ మేధ కేవలం సాంకేతిక సాధనం కాదు
అది మన జీవన విధానాన్ని మార్చేసే టెక్నాలజీ
దానివల్ల ఇక ప్రవేశ స్థాయి ఉద్యోగాలుండవు
నేరుగా మధ్య స్థాయి కొలువులే ఉంటాయి
నైపుణ్యాలు ఉన్న వారికి అద్భుతఅవకాశాలు
ఏఐలో ప్రపంచానికి నేతృత్వం వహించే సత్తా మనది: టీసీఎస్ ప్రెసిడెంట్ రాజన్న
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు ఒక సాంకేతిక సాధనం మాత్రమే కాదని.. అది సమాజం, వ్యాపారం, జీవన విధానాలను ప్రభావితం చేసే నాగరికత మార్పుగా రూపాంతరం చెందుతోందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ ప్రెసిడెంట్ వి.రాజన్న పేర్కొన్నారు. ఏఐ రంగంలో విప్లవాత్మకంగా చెబుతున్న ఆంత్రోపిక్ టూల్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తగ్గిపోతాయనే ఆందోళనల నేపథ్యంలో రాజన్న ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ముఖ్యాంశాలు..
ఏఐతో.. ముఖ్యంగా ఇటీవల చర్చనీయాంశంగా మారిన ఆంత్రోపిక్ ఏఐ ప్లగిన్స్ వంటివాటితో ఐటీ రంగంపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది?
వ్యక్తుల నుంచి సంస్థల వరకు.. సమూల మార్పు ఉంటుంది. మనం పనిచేసే విధానాన్ని, జీవించే విధానాన్ని ఏఐ పూర్తిగా మార్చుతోంది. వ్యక్తులను, సంస్థలను మరింత తెలివిగా, సమర్థంగా మారుస్తోంది. ఉత్పాదకత పెరిగేలా చేస్తోంది. అయితే.. గణితం, కంప్యూటర్ సైన్స్‌లో బలమైన పునాది ఉన్న భారత్‌కు ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించే సామర్థ్యం ఉంది. దీన్ని అద్భుత అవకాశంగా భావించాలి. ఇంతకు ముందటి సాంకేతిక విప్లవాలు పనిని వ్యాపార కార్యకలాపాల నుంచి డిజిటల్ స్థాయికి మార్చాయి. ఏఐ అందుకు భిన్నం. దానివల్ల.. సాధారణ పనులకు పరిమితమైన ప్రవేశ స్థాయి ఉద్యోగాలు తగ్గ్గిపోతాయి. కొత్తగా పట్టాలు పొందినవారు నేరుగా మధ్యస్థాయి ఉద్యోగాలకు వెళతారు. ఉన్నత స్థాయి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుంది. ఏఐ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, సిస్టం లెవల్ థింకర్స్, ఏఐ గవర్నెన్స్, అల్గారిథమ్స్, స్టాటిస్టికల్ మోడలింగ్, ఫుల్ స్టాక్ ఏఐ డెవలపర్స్ లాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉండబోతోంది. మేధో సంపత్తి (ఐపీ), ఉత్పత్తులు, కొత్త ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కొత్త ఆదాయ మార్గాలు సమకూరుతాయి.
వచ్చే 5-10 ఏళ్లలో కొత్తగా ఎలాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది?
సాధారణ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం చూపినా.. కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుంది. ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్థి చేయడానికి నైపుణ్యం కలిగినవారు అవసరమవుతారు. ఐటీలోనే కాకుండా వ్యవసాయం, ఆరోగ్యం, తయారీ, బ్యాంకింగ్ వంటి రంగాల్లోనూ ఏఐ విస్తృత మార్పులు తీసుకురాగలదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఏఐ ద్వారా నీళ్లు, ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ పంటల దిగుబడిని పెంచుతున్నాయి. దేశంలో వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో... ఆరోగ్య రంగంలో ఏఐ కీలక పాత్ర పోషించనుంది. వచ్చే 5-10 ఏళ్లలో శాప్, ఒరాకిల్, సర్వీస్ నౌ, ఎస్‌ఎ్‌ఫడీసీ వంటి సేవల్లోనూ ఏఐ నిపుణుల అవసరం ఏర్పడుతుంది. ఇంజనీరింగ్, వీఎల్‌ఎ్‌సఐ, 5జీ/6జీ, నెట్‌వర్క్ డిజైన్, చిప్ డిజైన్, పీఎల్ ఎం వంటి విభాగాలకు డిమాండ్ మరింత పెరుగుతుంది.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఉద్యోగాల కోసం ప్రభుత్వం, పరిశ్రమలు ఎలా సిద్ధమవ్వాలి?
ప్రభుత్వం, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు కలిసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను సిద్ధం చేయాలి. కొత్త మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచేలా ప్రణాళికలు ఉండాలి. ఈ దిశగా టీసీఎస్ ఇప్పటికే విశ్వవిద్యాలయాలతో శిక్షణ కార్యక్రమాలు, ఇంటర్న్‌షి్‌పలు, ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గ్రామీణ విద్యార్థులకు రిమోట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాములు అమల్లో ఉన్నాయి.
ఏఐ టూల్స్ రాకతో దేశ ఐటీ రంగంలో ఎలాంటి మార్పు ఉండబోతోంది?
ఐటీ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగం, బ్యాంకింగ్.. ఇలా ప్రతీ విభాగంలో సాంకేతికతకు నిరంతర డిమాండ్ ఉంటుంది. మరింత అభివృద్ధి సాధించడానికి పరిశ్రమలు ఏఐని అద్భుత అవకాశంగా భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవడం ఉద్యోగార్థులకు కీలకంగా మారింది. అయితే, నేర్చుకోవడం కూడా ఇప్పుడు సులభతరంగా మారింది. కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాల పెంపు కోసం ప్రయత్నిస్తున్నాయి. టీసీఎస్ కూడా ఉద్యోగులకు శిక్షణపై దృష్టి సారించింది. అందులో భాగంగా మేము ప్రతి శుక్రవారాన్నీ ‘ఏఐ డే’గా నిర్వహిస్తున్నాం.