ఏఐ-ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ కోర్సులే కావాలి!
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:09 AM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ.. బీటెక్‌లో ఈ కోర్సులకు ఉన్న డిమాండే వేరు.. ఇప్పుడు డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
అత్యధిక డిగ్రీ కాలేజీల దరఖాస్తు వాటికే..
డిగ్రీ, పీజీ కొత్త కోర్సుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 193 కాలేజీల దరఖాస్తు
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ.. బీటెక్‌లో ఈ కోర్సులకు ఉన్న డిమాండే వేరు.. ఇప్పుడు డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డిగ్రీ, పీజీల్లో కొత్త కోర్సులకు ఉన్నత విద్యామండలి ఇటీవల అనుమతించగా.. అత్యధిక డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ తరహాలో కేవలం ఏఐ-ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల వైపే మొగ్గు చూపాయి. డిగ్రీలో మొత్తం 19, పీజీలో 5 కోర్సులకు ఆసక్తి గల కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు గడువు గురువారం ముగియగా.. కొత్త కోర్సులకు మొత్తం 193 డిగ్రీ, పీజీ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో బీఎస్సీ ఏఐ-ఎంఎల్ కోర్సుకు అత్యధికంగా 6 యూనివర్సిటీల పరిధిలోని 58 డిగ్రీ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆ తర్వాత బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ కోర్సుకు 31 కాలేజీలు, బీకాం డిజిటల్ మార్కెటింగ్‌కు 26 కాలేజీలు అనుమతులు కోరాయి. మొత్తం డిగ్రీ కాలేజీల్లో దాదాపు 60 శాతం ఈ మూడు కోర్సులకే మొగ్గు చూపాయి. రాష్ట్రంలోని భారీ పరిశ్రమలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంతో అధ్యయనం చేసి తీసుకొచ్చిన చాలా కోర్సులపై కాలేజీలు ఆసక్తి చూపలేదు. ఒక్క దరఖాస్తూ చేసుకోలేదు. అయితే విద్యార్థులకు ఉద్యోగాలు అందించే కోర్సులపై కాలేజీలకు స్పష్టమైన అవగాహన లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్త కోర్సులపై కాలేజీల యాజమాన్యాలకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని, దరఖాస్తుకు మరోసారి అవకాశమిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు.