Share News

ప్రజారోగ్య రంగంలో సవాళ్లకు ఏఐతో చెక్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:26 AM

ప్రజారోగ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా అధిగమించవచ్చని.. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చేపట్టబోయే వినూత్న మార్పులకు...

ప్రజారోగ్య రంగంలో సవాళ్లకు ఏఐతో చెక్‌

  • సాంకేతికత జోడింపుతోనే సేవల్లో వినూత్న మార్పులు: నిపుణులు

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : ప్రజారోగ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా అధిగమించవచ్చని.. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చేపట్టబోయే వినూత్న మార్పులకు ఏఐ సాంకేతికతను జోడించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘ఏఐ ఇన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌’అంశంపై హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) వేదికగా మూడు రోజుల పాటు నిర్వహించిన సదస్సు ఆదివారం ముగిసింది. ఇందులో తెలంగాణతోపాటు ఏపీ, గోవా, అస్సాం రాష్ట్రాలకు చెందిన మొత్తం 78మంది ప్రతినిధుల్లో ముఖ్యంగా వైద్యులు, ఆరోగ్యరంగ నిపుణులు, పాలనా విభాగాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఐఎ్‌సబీ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో.. ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న సమస్యలకు ఏఐ ద్వారా పరిష్కారాలను ఎలా కనుగొనవచ్చనే అంశంపై చర్చించారు. వాస్తవ పరిస్థితుల్లో ఏఐని ఎలా వినియోగించాలి, డేటా విశ్లేషణ ద్వారా వ్యాధులను ముందే ఎలా గుర్తించాలనే అంశాలపై బృంద చర్చలు నిర్వహించారు. ఈ కార్యశాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని, తెలంగాణ నుంచి 34 మంది ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు హాజరయ్యారని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యులు విమల థామస్‌, మణిషా సహాయ్‌, కిరణ్‌ మాధాల, నవ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 06:27 AM