టెక్నాలజీ.. అసిస్టెంటే.. జడ్జి కావొద్దు
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:45 AM
నూతన సాంకేతిక పరిజ్ఞానం, కత్రిమ మేధ (ఏఐ)ని న్యాయవ్యవస్థలో వినియోగించాల్సిందేనని.. అయితే కొత్త టెక్నాలజీ సహాయకారి మాత్రమేగానీ జడ్జి కాకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువల లెన్స్‌తో సాంకేతికతను పరిశీలించాలి: సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్
న్యాయ వివేచన ఏఐ టూల్స్‌తో రాదు
న్యాయపాలనను నిలబెట్టేవి పారదర్శకత, స్వతంత్రత, సమగ్రత: జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ
దక్షిణాది న్యాయాధికారుల సదస్సు ప్రారంభం
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): నూతన సాంకేతిక పరిజ్ఞానం, కత్రిమ మేధ (ఏఐ)ని న్యాయవ్యవస్థలో వినియోగించాల్సిందేనని.. అయితే కొత్త టెక్నాలజీ సహాయకారి మాత్రమేగానీ జడ్జి కాకూడదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ పేర్కొన్నారు. ‘సాంకేతిక పరిజ్ఞానం- చట్టబద్ధపాలన- సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై హైటెక్స్ నోవాటెల్‌లో శనివారం దక్షిణాది రాష్ట్రాల న్యాయాధికారుల సదస్సు జరిగింది. దీంట్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ అనిరుద్ధ బోస్ తదితరులతో కలిసి జస్టిస్ విక్రమ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టెక్నాలజీ కొత్తగా వచ్చింది కాబట్టి దాన్ని తిరస్కరించరాదు.. టెక్నాలజీ సమర్థంగా పనిచేస్తోంది కాబట్టి దాన్ని గుడ్డిగా నమ్మరాదు. టెక్నాలజీని రాజ్యాంగ విలువలు అనే లెన్స్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించాలి. న్యాయవాదులు, జడ్జిలకు పనిని సులభతరం చేయడానికి, సమయాన్ని ఆదా చేయడానికి ఏఐ ఉపయోగపడుతుంది. శిక్షణ పొందిన న్యాయవాది మనస్సును, న్యాయాధికారి నైతిక బాధ్యతను, జడ్జికి ఉండాల్సిన క్రమశిక్షణ కలిగిన తీర్పు అనే లక్షణాన్ని ఏఐ పూరించలేదు. ఏఐతో డ్రాఫ్ట్ నోట్‌లు అయితే తయారవుతాయేమో కానీ చట్టాలు రూపుదిద్దుకోవు’ అని పేర్కొన్నారు. చరిత్ర, సృజనాత్మకత కలగలిసిన నగరం హైదరాబాద్ అని, ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా తనను పిలవవచ్చని జస్టిస్ విక్రమ్‌నాథ్ తెలిపారు.
మానవుల ఆత్మను అల్గారిథం నియంత్రించలేదు
జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ మాట్లాడుతూ.. మానవుల ఆత్మను ఏ అల్గారిథం నియంత్రించలేదని.. న్యాయపాలనకు అర్థాన్ని ఇచ్చే న్యాయ వివేచన (జ్యుడీషియల్ మైండ్) ఏఐ టూల్స్‌తో రాదని స్పష్టం చేశారు. న్యాయపాలనను ఎప్పటికప్పుడు నిలబెట్టేవి పారదర్శకత, స్వతంత్రత, సమగ్రత మాత్రమేనన్నారు. కక్షిదారులు కేంద్రంగా టెక్నాలజీ పనిచేసేలా న్యాయమూర్తులు చూసుకోవాలని.. ఆటోమేటెడ్ జస్టిస్ మనకు అవసరం లేదన్నారు. తాను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. నాలుగన్నరేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందం కలిగించిందని, ఇంటికి తిరిగి వచ్చినట్లు ఉందని సంతోషం వెలిబుచ్చారు. ఇక్కడి వాతావరణం, ఇక్కడి చరిత్ర, భవనాలు, ఇక్కడి గాలి, మనుషులు.. అన్నీ తనకు ఎంతో నచ్చుతాయని జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ పేర్కొన్నారు. అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలో ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పులో తాను భాగస్వామిగా ఉన్నానని.. ఆ కేసు వేరే రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ.. ఎస్సీ వర్గీకరణ అంశానికి తెలంగాణకు ఎంతో అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఎస్సీల్లోని ఒక కులం ప్రజలు అత్యంత వెనుకబడి ఉన్నారని.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఉన్నత న్యాయవ్యవస్థలో వారికి ఒక్క పదవి కూడా దక్కలేదని తెలిపారు. అందుకే జస్టిస్ గవాయ్ ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో కూడా క్రిమీలేయర్ ప్రతిపాదనను అత్యంత ధైర్యంగా ముందుకు తెచ్చారని కొనియాడారు. తన తండ్రి గవర్నర్ అని, తాను భారత ప్రధాన న్యాయమూర్తినని, తన కుమారుడికి రిజర్వేషన్ ఎందుకు? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కోర్టును సమర్థంగా నిర్వహించడానికి టెక్నాలజీలో వస్తున్న నూతన పోకడలను వినియోగించుకోవాలన్నారు. సైబర్ క్రైం, డిజిటల్ ఫోరెన్సిక్, ఏఐ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటి అంశాలపై ఈ రెండురోజుల సదస్సులో సమగ్ర చర్చ జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ మౌషమీ భట్టాచార్య, జస్టిస్ కే లక్ష్మణ్, దక్షిణాది రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయాధికారులు పాల్గొన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రూపొందించిన మొబైల్ లోక్‌అదాలత్ వాహనాలను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రారంభించారు.