ఉపాధి పనులపై ఏఐ
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:40 AM
ఉపాధిహామీ పథకంలో పారదర్శకత పెంచడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ రోజ్‌గార్ గ్యారెంటీ, ఆజీవి కా మిషన్(వీబీ-జీ-రాంజీ)ను నూతన పథకాన్ని అమల్లోకితీసుకొచ్చింది.
డిజిటల్ ప్రణాళిక, ఏఐ ఆధారిత పర్యవేక్షణ
డ్రోన్లు, శాటిలైట్ చిత్రాలతో పనులపై నిఘా
నకిలీ మస్టర్లు, తప్పుడు కొలతలకు చెక్
100 రోజుల పనికి బదులు 125రోజులు
ఉపాధిహామీ పథకంలో పారదర్శకత పెంచడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ రోజ్‌గార్ గ్యారెంటీ, ఆజీవి కా మిషన్(వీబీ-జీ-రాంజీ)ను నూతన పథకాన్ని అమల్లోకితీసుకొచ్చింది. ప్రతి కుటుంబానికి 125 రోజుల పని గ్యారెంటీ ఇస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ పనుల పర్యవేక్షణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానంలో చోటుచేసుకున్న నకిలీ మస్టర్లు, తప్పుడు కొలతలు, బినామీ దందాలకు ఈ వ్యవస్థతో చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి-మఠంపల్లి)
కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత పర్యవేక్షణకు చట్టబద్ద్ధత కల్పించడం ఈ విధానంలో ప్రధాన మార్పుగా నిలిచింది. డిజిటల్ రికార్డులు, శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ సర్వేల ఆధారంగా పనుల ప్రామాణికతను నిర్థారించనున్నారు. దీంతో ఉపాధిహామీ పథకం అమలు మరింత పారదర్శకంగా మారనుంది. కొత్త విధానంలో ఇస్రో భువన్ పోర్టల్‌కు చెందిన శాటిలైట్ చిత్రాలను విస్తృతంగా వినియోగించనున్నారు. ప్రతి జిల్లాలో అంబుడ్స్‌మన్‌కు డ్రోన్ పర్యవేక్షణ సౌకర్యం కల్పించనున్నారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చొని తప్పుడు కొలతలు నమోదు చేసే అవకాశాలను పూర్తిగా నిరోధించేలా వ్యవస్థను రూపొందించారు. శాటిలైట్, డ్రోన్ ద్వారా నమోదైన కొలతలు, ఎంబుక్‌లో నమోదు వివరాలు సరిపోలకుంటే వెంటనే విచారణ చేపట్టనున్నారు. అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత అధికారుల ఐడీలను నిలిపివేయడంతో పాటు రికవరీ చర్యలు చేపట్టనున్నారు.
ఏఐకి చిక్కనున్న ఫీల్డ్ ట్రిక్స్..
గ్రామీణ ప్రాంతాల్లో కొందరు కూలీలు, మేట్లు కలిసి అమలు చేస్తున్న మోసాలకు కూడా కొత్త విధానంతో అడ్డుకట్ట పడనుంది. ఉదయం, మధ్యాహ్నం హాజరు ఫొటోలు తీసుకుని మధ్యలో పనిచేయకుండా వెళ్లే ఘటనలను ఏఐ సులభంగా గుర్తించనుంది. ఉదయం తీసిన ఫొటో, మధ్యాహ్నం తీసిన ఫొటోలను క్లౌడ్ సర్వర్‌లోని ఏఐ సాఫ్ట్‌వేర్ క్షణాల్లో విశ్లేషిస్తోంది. రెండు ఫొటోల మధ్య పనిలో ఎలాంటి పురోగతి లేకపోతే ఆ రోజు పని జరగలేదని వ్యవస్థ స్వయంగా గుర్తిస్తుంది. అలాంటి మస్టర్లను ఆటోమేటిక్‌గా తిరస్కరించి చెల్లింపులను నిలిపివేస్తుంది. ఫొటోలను మొబైల్ స్ర్కీన్‌పై చూపించి మళ్లీ చిత్రీకరించే మోసాలను కూడా ఏఐ కనిపెట్టనుంది.
కూలీలకు అదనపు ప్రయోజనాలు..
కొత్త విధానంతో నిజాయితీగా పనిచేసే కూలీలకు ప్రత్యేక ప్రయోజనాలు అందనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచే నిర్ణయం తీసుకున్నారు. కనీస వేతనాన్ని రూ.308గా నిర్ణయించడంతో కూలీల ఆదాయం మరింత పెరగనుంది. అక్రమాలకు అవకాశం లేకుండా డిజిటల్ పర్యవేక్షణ కొనసాగనుండడంతో అర్హులైన కూలీలకే ప్రయోజనాలు అందే అవకాశముంది. నకిలీ మస్టర్లకు పూర్తిగా చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు. సాంకేతికతతో ఉపాధిహామీ పథకం మరింత సమర్థంగా, పారదర్శకంగా అమలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలవ్యాప్తంగా 29 పంచాయతీలకు మొత్తం 14,926 జాబ్‌కార్డులు ఉన్నాయి. మొత్తం 31,360 మంది కూలీలు ఉన్నారు. వారిలో 16,162 మంది కూలీలు ఉపాధిహామీ పనులకు వస్తున్నారు.
పెరగనున్న జవాబుదారీతనం
ఇప్పటివరకు ఏఐ ఆధారిత హాజరు కేవలం నిబంధనగానే ఉండేది. ప్రస్తుతం దానికి చట్టబద్ద గుర్తింపు కల్పించడం వల్ల అధికారుల బాధ్యత మరింత పెరగనుంది. డిజిటల్ కొలతలకు భిన్నంగా ఎంబుక్ నమోదు చేసిన అధికారులపై నేరుగా విచారణ చేపట్టే వెసులుబాటు కల్పించారు. సాంకేతిక ఆధారాలను విస్మరించి తప్పుడు నివేదికలు సమర్పిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో పనుల అమలులో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం కూడా పెరుగుతందని భావిస్తున్నారు. ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి గట్టి అడ్డుకట్ట పడుతుందని అంచనా వేస్తున్నారు.