తప్పుడు వివరాలిస్తే..ఏఐ పట్టేస్తుంది!
ABN , Publish Date - Jul 25 , 2026 | 06:12 AM
ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే ఆస్తులు, వాహనాలు, భూముల వివరాలను పక్కాగా తెలియజేయాలి. లేదంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వెంటనే పట్టేస్తుంది.
360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌కు తోడు కృత్రిమ మేధ వినియోగం
ఇందిరమ్మ ఇళ్ల పథకంలోనూ..
దరఖాస్తుదారు పేర్కొన్న వివరాలు సరైనవో, కాదో చెప్పేస్తున్న ఏఐ
చెప్పని ఆస్తులనూ వెల్లడిస్తున్న వైనం
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే ఆస్తులు, వాహనాలు, భూముల వివరాలను పక్కాగా తెలియజేయాలి. లేదంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వెంటనే పట్టేస్తుంది. దరఖాస్తుదారు ఆస్తి వివరాలు తెలుపుతూ.. ఆ పథకానికి అర్హులో, కాదో కూడా చెప్పేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు సహా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాలకు దరఖాస్తుల పరిశీలనలో ఆయా శాఖలు ఏఐను విరివిగా వినియోగిస్తున్నాయి. దీంతోపాటు 360 డిగ్రీల కోణంలోనూ పరిశీలించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాయి. దాంతో ఈ సాఫ్ట్‌వేర్‌కు ఏఐ తోడయి.. దరఖాస్తుదారులు ఇవ్వని వివరాలతోపాటు వారి భూములు, ఆస్తులు, వాహనాల వివరాలన్నింటినీ బయటపెట్టేస్తున్నాయి. ఫలితంగా ఆయా పథకాల నిబంధనల మేరకు అర్హులు, అనర్హులు తేలడంతోపాటు సమయం ఆదా అవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల వరకు పలు దశల్లో పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారు ఇంటివద్దకు వెళ్లి మరీ వివరాలు సేకరిస్తారు. అనంతరం ఆ దరఖాస్తును 360 డిగ్రీలతో పరిశీలించే సాఫ్ట్‌వేర్‌లోనూ పరిశీలిస్తారు. ఇప్పుడు దీనికి ఏఐను జత చేశారు. దాంతో దరఖాస్తుదారు ఇచ్చిన వివరాలు సరైనవో, కాదో చెప్పడంతోపాటు అతనికి ఇతర ఆస్తులు, వాహనాలు, భూములు ఏవైనా ఉన్నా తేల్చేస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఇలాంటి ఘటనే జరిగింది.
152 మందిని అనర్హులుగా తేల్చిన ఏఐ..
2023 డిసెంబరులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జమ్మికుంట మునిసిపల్ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం 2,448 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 152 మంది అనర్హులుగా తేలింది. దీంతో వారంతా తమ పేర్లు జాబితాలో ఎందుకు రాలేదంటూ అఽధికారులను ప్రశ్నించారు. అయితే దరఖాస్తుల్లో ఆస్తులు, భూముల వివరాలను తప్పుగా పేర్కొన్నారని, కొందరి పేర్లపై ప్లాట్లు, బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా ఉన్నాయని ఏఐ గుర్తించినట్టు అధికారులు వారికి తెలిపారు. వివరాలతో సహా దరఖాస్తుదారులకు చెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. వారి స్థానంలో అర్హులైన వారికి ఇళ్లు కేటాయించేందుకు అవకాశం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఏఐని ప్రభుత్వంలోని ఇతర మరికొన్ని శాఖలు కూడా విరివిగా వినియోగిస్తున్నాయి. రేషన్‌కార్డులు, పింఛన్ల దరఖాస్తులను పరిశీలించేందుకు కూడా ఏఐతోపాటు 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల్లో పనిచేస్తున్నట్లు చూపిస్తున్న ఉద్యోగులు, వారి జీతాల వ్యవహారంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల వివరాల నమోదు కోసం తీసుకువచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్‌లోనూ వీటిని పొందుపరిచినట్టు తెలిసింది. ఆ కారణంగానే ఏజెన్సీల్లో చాలా మంది నకిలీ ఉద్యోగులు ఉన్నారని, ఒకటే ఆధార్ నంబరు రెండు చోట్ల ఉన్నట్టు చూపిస్తోందన్న విషయాలు ఇటీవల వెల్లడయ్యాయని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు.
ఏఐ చెప్పినా మళ్లీ చెక్ చేయాల్సిందే..
ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్, ఏఐ సాంకేతిక ద్వారా తెలుసుకున్నా.. అవి తేల్చిన వివరాలపై మరోసారి క్షేత్రస్థాయి పరిశీలిన కచ్చితంగా చేయాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో బేస్‌మెంట్ లెవల్‌ను కొంతస్థాయిలో ఉండాలని ఏఐతో కూడిన చెకింగ్ సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేశారు. క్షేత్రస్థాయిలో బేస్‌మెంట్ లెవల్‌కు వచ్చాక పటుత్వం కోసం మట్టిని నింపుతారు. అది బేస్‌మెంట్ కంటే తక్కువ ఉండొచ్చు, లేదా పైకి ఉండొచ్చు. ఆ సమయంలో పైకి ఉంటే నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తక్కువ ఉంటే అసలు బేస్‌మెంట్‌లో ఏమీ లేదని చెప్పే అవకాశం ఉంటుందని అఽధికారులు అంటున్నారు. ఇటీవల 14 వేల నిర్మాణాల విషయంలో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిలో కొన్నింటిని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి పరిష్కరించామని, మరికొన్నింటిని పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు.. ఒకవేళ సాఫ్ట్‌వేర్, ఏఐ చెప్పిన వివరాల్లో ఏవైనా తప్పుగా ఉంటే.. ఆ ఆస్తులు, భూములు, వాహనాలు తమవి కావని నిర్ధారిస్తూ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తెచ్చి సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచిస్తున్నారు. వాటిని రూడీ చేసుకున్నాక పథకంలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు.