దేశంలో ఏఐ ఇంజనీర్ల నియామకాల్లో 59 శాతం వృద్ధి
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:48 AM
భారతదేశంలో ఏఐ ఇంజినీర్ల నియామకాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని, మరీ ముఖ్యంగా యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల..
విజయవాడ వంటి నగరాల్లోనూ నియామకాల జోరు
గత సంవత్సరంతో పోలిస్తే 51శాతం పెరుగుదల
విజయవాడలో అది 45.5శాతం.. లింక్డ్‌ఇన్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో ఏఐ ఇంజినీర్ల నియామకాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోందని, మరీ ముఖ్యంగా యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలను సైతం అధిగమించే స్థాయి లో ఇది ఉందని లింక్డ్‌ఇన్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఏఐ నియామకాలు గతేడాదితో పోలిస్తే 59.5 శాతం పెరిగాయని, సాఫ్ట్‌వేర్ కేంద్రాలైన బెంగళూరు, హైదరాబాద్‌లలో ఈ వేగం కనిపిస్తున్నా.. విజయవాడ వంటి నగరాల్లోనూ ఏఐ ఇంజినీర్ల నియామకాల్లో జోరు కనిపిస్తుండటం మాత్రం విశేషంగానే చూడాలని చెబుతోందా నివేదిక. ఏఐ లేబర్ మార్కెట్ రిపోర్ట్ 2026గా విడుదల చేసిన ఈ నివేదిక వివరాల ప్రకారం హైదరాబాద్‌లో ఈ నియామకాలు గతేడాదితో పోలిస్తే 51 శాతం పెరిగితే, విజయవాడలో అది 45.5 శాతంగా ఉందని తెలిపింది. పలు పరిశ్రమలు, కంపెనీలలో ఏఐ వినియోగం పెరగడమే దీనికి కారణంగా పేర్కొన్న ఆ నివేదిక... మౌలిక సదుపాయాలు, పాలనాపరమైన విధానాలు, నిర్వహణ కోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్న పెద్ద కంపెనీలు ఏఐ నిపుణుల నియామకాల్లో కూడా అదే స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపింది. చిన్న, మధ్య తరహా కంపెనీలు కూడా ఈ నియామకాల్లో వేగం చూపుతున్నాయని నివేదించింది. తయారీ రంగంలో ఏఐ ఇంజినీర్ల సంఖ్య ఇప్పుడు నాలుగు రెట్లు వృద్ధి చెందిందని వివరించింది. ఏఐ ఏజెంట్స్, ఏఐ ప్రొడక్టివిటీ, అజూర్ ఏఐ స్టూడియో, ఇంటిలిజెంట్ ఏజెంట్స్, ఆటోమేటెడ్ ఫీచర్ ఇంజినీరింగ్ వంటి నైపుణ్యాలకు ఇప్పుడు డిమాండ్ అధికంగా ఉందని లింక్డ్‌ఇన్ ఇండియా ఇంజినీరింగ్ హెడ్ మలై లక్ష్మణన్ తెలిపారు.