విద్యుత్ డిమాండ్‌లో వ్యవసాయానిదే అగ్ర భాగం
ABN , Publish Date - Apr 26 , 2026 | 04:18 AM
విద్యుత్ డిమాండ్‌ను వ్యవసాయ రంగం శాసిస్తోంది. రబీ సీజన్ ముగియడంతో విద్యుత్ డిమాండ్, వినియోగం సాధారణ స్థాయికి చేరడమే అందుకు నిదర్శనం.
రబీ సీజన్ పూర్తికావడంతో 13 వేల మెగావాట్లకు తగ్గుదల
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ డిమాండ్‌ను వ్యవసాయ రంగం శాసిస్తోంది. రబీ సీజన్ ముగియడంతో విద్యుత్ డిమాండ్, వినియోగం సాధారణ స్థాయికి చేరడమే అందుకు నిదర్శనం. మార్చి 27న 18,548 మెగావాట్లుగా ఉన్న డిమాండ్ క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం (ఈనెల 24న) 13,187 మెగావాట్లుగా నమోదయింది. వినియోగం 266.92 మిలియన్ యూనిట్లుగా ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లు అధికారికంగా 29 లక్షలుగా ఉండగా... అనధికారికంగా 35 లక్షల దాకా ఉంటాయని అంచనా. ప్రతిఏటా ఖరీఫ్ (జూలై 1- అక్టోబరు 31), రబీ (డిసెంబరు 1- మార్చి 31) సీజన్లలో విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. 2025 మే నెలలో 11,509 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యాక 2025 జూలైలో 15,443, ఆగస్టులో 16,613, సెప్టెంబరులో 15,906 మెగావాట్లుగా నమోదయింది. మళ్లీ క్రమంగా తగ్గుతూ అక్టోబరులో 12,998, నవంబరులో 11,188 మెగావాట్లకు చేరింది. ఇక రబీ ప్రారంభ నెల డిసెంబరులో విద్యుత్ డిమాండ్ 14,653 మెగావాట్లు ఉండగా.. మార్చి 27న ఏకంగా 18,548 మెగావాట్లకు పెరిగింది.