Share News

Department of Agriculture: వేటు వేస్తారా.. అడ్మిషన్ల రద్దుతో సరిపెడతారా?

ABN , Publish Date - Jan 12 , 2026 | 04:53 AM

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ మూడో సంవత్సరం ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంపై వ్యవసాయ శాఖ దృష్టిపెట్టింది.

Department of Agriculture: వేటు వేస్తారా.. అడ్మిషన్ల రద్దుతో సరిపెడతారా?

  • పేపర్‌ లీకేజీకి పాల్పడిన ఏఈవోలపై చర్యలేంటి?

  • వ్యవసాయ శాఖ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా చర్చ

  • ఆ శాఖకు 34 మంది ఇన్‌సర్వీ్‌స్ ఏఈవోల సరెండర్‌

  • పోలీసు విచారణకు నేడు డీజీపీని కోరనున్న వీసీ

హైదరాబాద్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ మూడో సంవత్సరం ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంపై వ్యవసాయ శాఖ దృష్టిపెట్టింది. ఇందులో భాగస్వాములైన 34 మంది ఇన్‌సర్వీ్‌స్ ఏఈవోల అడ్మిషన్లను రద్దుచేసి వ్యవసాయ శాఖకు సరెండర్‌ చేశారు. యూనివర్సిటీ వీసీ స్థాయిలో తీసుకున్న చర్యలతో సరిపెడతారా? శాఖాపరంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? అనే చర్చ వ్యవసాయ శాఖలో సాగుతోంది. పేపర్‌ లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరేందుకు యూనివర్సిటీ వీసీ అల్దాస్‌ జానయ్య సోమవారం డీజీపీ శివధర్‌రెడ్డిని కలవనున్నట్లు సమాచారం. మూడేళ్ల క్రితం వ్యవసాయశాఖ సిఫారసుతో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశాలు పొందిన ఇన్‌సర్వీస్ ఏఈవోలు... పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎనిమిదేళ్లుగా ఈ తంతు కొనసాగుతుండగా, గత మూడేళ్లలో నిర్వహించిన ఆరు సెమిస్టర్‌ పరీక్షల్లో పేపర్‌ లీకేజీ చేసి, చూసి రాసినట్లు యూనివర్సిటీ అధికారుల విచారణలో తేటతెల్లమైంది. దీంతో వరంగల్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌, సిరిసిల్ల, రాజేంద్రనగర్‌, పాలెం, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలల్లో చదువుతున్న 34 మంది ఇన్‌సర్వీస్ ఏఈవోల అడ్మిషన్లను రద్దు చేసి, వ్యవసాయ శాఖకు సరెండర్‌ చేశారు. ఈ వ్యవహారంపై సీఎంవో వర్గాలు, ఇంటలిజెన్స్‌ కూడా ఆరాతీసి... సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీరియ్‌సగా ఉన్నట్లు సమాచారం. కేవలం ఇన్‌సర్వీస్ ఏఈవోల అడ్మిషన్ల రద్దుతో సరిపెడతారా? లేకపోతే ఏఈవో విధుల నుంచి కూడా సస్పెండ్‌ చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. ఇన్‌సర్వీస్ ఏఈవోలు పేపర్‌ లీకేజీ చేయటంతోపాటు హైటెక్‌ పద్ధతిలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినట్లు, ‘ఏఐ’ ఆధారిత పెన్నులతో జవాబులు రాసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనిపై సైబర్‌ క్రైమ్‌ విభాగంతో విచారణ జరిపిస్తున్నారు. కాగా, వీసీ నియమించిన విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఇప్పటికే జగిత్యాల కళాశాల డీన్‌ భారతి నారాయణభట్‌తో పాటు వరంగల్‌, జగిత్యాల కళాశాలల్లో పనిచేస్తున్న సత్యనారాయణరెడ్డి, రమేష్‌, కార్తీక్‌ను పేపర్‌ లీకేజీకి ప్రధాన బాధ్యులుగా గుర్తించి సస్పెండ్‌ చేశారు.

Updated Date - Jan 12 , 2026 | 05:55 AM