Share News

షోరూమ్‌లో రిజిస్ట్రేషన్లకూ ఏజెంట్‌ పేరిట వసూళ్లు!

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:45 AM

వాహనాల యజమానులు రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. షో రూమ్‌లోనే రిజిస్ర్టేషన్‌ చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నా..

షోరూమ్‌లో రిజిస్ట్రేషన్లకూ ఏజెంట్‌ పేరిట వసూళ్లు!

  • బైక్‌లకు రూ.1000, కార్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): వాహనాల యజమానులు రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. షో రూమ్‌లోనే రిజిస్ర్టేషన్‌ చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నా.. ఏజెంట్లకు చెల్లింపులు మాత్రం తప్పడం లేదు. ద్విచక్ర వాహనాలకు రూ.1000 నుంచి రూ.1500, కార్లకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు డీలర్లు వసూలు చేస్తున్నారు. రిజిస్ర్టేషన్‌ ఇక్కడే జరుగుతుంది కదా అని వాహన కొనుగోలుదారులు అడిగితే, ‘‘ఇక్కడి నుంచి ఫైలు రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్తుంది. అధికారులు ఆమోదిస్తేనే రిజిస్ర్టేషన్‌ పూర్తవుతుంది. అక్కడి ఖర్చుల కోసం చెల్లించాల్సిందే’’ అని షోరూమ్‌లలోని సిబ్బంది చెబుతున్నారు. అంతేకాదు.. వాహనాల కొనుగోలుకు సంబంధించి ఇచ్చే కొటేషన్లలోనూ ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంటున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు షోరూమ్‌లో వాహనం కొనుగోలు చేయగానే తాతాల్కిక రిజిస్ర్టేషన్‌ నంబర్‌ (టీఆర్‌) ఇచ్చేవారు. ఆ తరువాత శాశ్వత రిజిస్ర్టేషన్‌ కోసం వాహనదారుడు ఆర్‌టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది.

కొటేషన్‌లో రాసి మరీ వసూలు..!

ఆర్‌టీఏ కార్యాలయాల్లో గంటల తరబడి నిరీక్షణ, దళారీ దందా(ఏజెంట్లు) నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల షోరూమ్‌లలోనే రిజిస్ర్టేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు. షోరూమ్‌లలోనే లైఫ్‌ ట్యాక్స్‌, టీఆర్‌, స్మార్ట్‌ కార్డు, ఇతరత్రా రుసుము చెల్లించాలి. ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన రోడ్డు భద్రతా రుసుము కూడా వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం షోరూమ్‌లలో మినహా రవాణా శాఖ కార్యాలయాల్లో పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా.. ఏజెంట్లు, ఆర్‌టీఏ కార్యాలయాల్లో ఖర్చుల పేరిట వసూళ్లు ఆగడం లేదు. హిమాయత్‌నగర్‌, ఉప్పల్‌లోని రెండు వేర్వేరు సంస్థల ద్విచక్ర వాహనాల షోరూమ్‌లకు కొటేషన్‌ తీసుకునేందుకు ఓ వ్యక్తి వెళ్లగా.. ఓ షోరూమ్‌లో ఏజెంట్‌కు ఇవ్వాలని, మరో షోరూంలో ఆర్‌టీఏ ఆఫీ్‌సలో ఖర్చుల కోసం రూ.1000 చెల్లించాలని రాశారు. సికింద్రాబాద్‌లోని ఓ కార్ల షోరూంలో రిజిస్ర్టేషన్‌ కోసం అదనపు ఖర్చుల పేరిట రూ.3 వేలు, బంజారాహిల్స్‌లోని ఓ షోరూంలో రూ.5 వేలు హ్యాండ్లింగ్‌ చార్జీల పేరిట చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. నగరంలోని అత్యధిక షోరూమ్‌లలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. అయినా అధికారులు దీనిని నియంత్రించకపోవడం గమనార్హం.

Updated Date - Mar 10 , 2026 | 03:45 AM