kumaram bheem asifabad-ఏజెన్సీ బంద్ ప్రశాంతం
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:21 PM
ఆదివాసీలకు పోలీసు ఉద్యోగాలలో 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి హక్కుల పోరాట కమిటీ, తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది.
ఆసిఫాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలకు పోలీసు ఉద్యోగాలలో 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి హక్కుల పోరాట కమిటీ, తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. దీంతో పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సమూదాయాలు, పాఠశాలలు, కళాశాలలు బంద్ పాటించి స్వచ్చందంగా మద్దతు తెలిపాయి. అనంతరం ఆర్టీసీ బస్టాండు ఎదుట ఆదివాసీ సంఘాల నాయకులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్ మాట్లాడుతూ గత పోలీసు నోటిఫికేషన్‌లో ఐదో షెడ్యూల్ భూభాగంలో నివసించే ఆదివాసిలకు ఉన్న 75 శాతం స్థానిక రిజర్వేషన్‌ను ప్రస్తుత పోలీసు నోటిఫికేషన్‌లో తొలగించి జనరల్‌గా మార్చడం ఆదివాసి నిరుద్యోగ యువత పొట్టకొట్టడమేనన్నారు. 1/70, పెసా చట్టాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని ఆరోపించారు. ఆదివాసీల చట్టాలను జీవోలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల, తుడుందెబ్బ నాయకులు మారుతి, వెంకటేష్, భీంరావు,నగేష్, కైలాస్, జగన్, సోమేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బుధవారం ఆదివాసీ సంఘాలు ఇచ్చిన ఏజెన్సీ బంద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసంది. వాంకిడి మండలంలో ఉదయం నుంచి వ్యాపార సమూదాయాలు, దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. ప్రైవేట్ పాఠశాలలను ఆదివాసీ నాయకులు మూసివేయించారు. ఏజెన్సీ ప్రాంత యువకులకు ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ మండలంలోని ఆదివాసీ సంఘాల నాయకులు మండలకేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా ఏలాంటి సంఘటణలు జరుగకుండా ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం ఆదివాసీ సంఘాల అధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ఏజెన్సీ బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా ముగిసింది. గతంలో రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు 75 శాతం నియామకాలను అమలు చేశారని, ప్రస్తుతం ఆ విధానాన్ని కొనసాగించకపోవడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కుమ్ర భీంరావు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మధురాజ్ అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై కొమురయ్య అధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, సర్పంచ్ ఆత్రం ఓంప్రకాష్, మాజీ ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు, ఉప సర్పంచ్ పెందొర్ రాము, ఆత్రం జ్యోతిరాం, దుర్వ సోనేరావు, సేడ్మకి జుగాదిరావు, ఆత్రం సుధాకర్ పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌లో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆదివాసీ విద్యార్థి సంఘంతో పాటు తుడుందెబ్బ, పలు గిరిజన సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం చేపట్టిన ఏజెన్సీ బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌కు మద్దతు తెలుపుతు వ్యాపారులు స్వఛ్ఛందంగా దుకాణ సముదాయాలు మూసి వేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ సంఘం జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌కుమార్ మాట్లాడుతు గతంలో గతంలో పోలీసు నియమాకాల్లో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు 75 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో అనేక మంది గిరిజనులు పోలీసు శాఖలో భర్తీ అయ్యారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి మధురాజ్, తుడుందెబ్బ మండల అధ్యక్షులు చాహకటి గణేష్, వివిధ సంఘాల సభ్యులు కాసీరాం, రాంజీ, మోతీరాం, ప్రకాష్, సంజీవ్ పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన ఏజేన్సీ బంద్ ప్రశాంతంగా జరిగింది.ఈ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు మేకల ప్రసాద్, కుర్మా ప్రసాద్ మాట్లాడుతూ అదివాసి అభ్యర్థుల హక్కుల కోసం చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గట్ట శంకర్, మేకల పనిందర్, ఎమాజీ, బాను ప్రసాద్, ఆశోక్, మఽధుకర్ సంతోష్, సాయి నాయకులు పాల్గొన్నారు.
కెరమెరి (ఆంధ్రజ్యోతి): మండలంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు పెందోర్ రాజేశ్వర్, మోతీరాం, కన్నాక ప్రభాకర్, మనోహర్, శ్రీనివాస్, సోము తదితరులు పాల్గొన్నారు.