ఆలయాల పూలతో.. ‘జైలు’ అగరబత్తులు!
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:54 AM
జైలు గోడల మధ్య ఖైదీల చేతిలో రూపుదిద్దుకుంటున్న అగరబత్తులు ఇప్పుడు భగవంతుడి సేవకు సిద్ధమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ...
టీటీడీ తరహాలో.. భద్రాద్రి, వేములవాడ పుష్పాలతో తయారీ
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : జైలు గోడల మధ్య ఖైదీల చేతిలో రూపుదిద్దుకుంటున్న అగరబత్తులు ఇప్పుడు భగవంతుడి సేవకు సిద్ధమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో.. భద్రాద్రి రామయ్య, వేములవాడ రాజన్న వంటి ప్రముఖ ఆలయాల్లో పూజకు వినియోగించిన పువ్వులను సేకరించి వాటితో సహజసిద్ధమైన అగరబత్తులను తెలంగాణ జైళ్ల శాఖ తయారు చేస్తోంది. మై నేషన్ బ్రాండ్ పేరుతో నాణ్యంగా తయారు చేస్తుండడంతో ఈ ఉత్పత్తులకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆయా జైళ్ల వద్ద ఉన్న స్టాళ్లతో పాటు జైళ్లశాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మై నేషన్ స్టాళ్లలో వీటిని విక్రయిస్తున్నారు. రసాయనాలు వాడకుండా చేసే ఈ అగరబత్తుల తయారీ వెనక పెద్ద ప్రక్రియే ఉంది. ఆలయాల నుంచి సేకరించే గులాబీ, చామంతి, బంతి వంటి పువ్వులను మొదటగా గ్రేడింగ్ చేసి ఎండలో ఆరబెడతారు. ఎండిన పూలను పొడి చేసి సహజసిద్ధమైన బొగ్గుపొడి కలిపి అగర బత్తులుగా మలుస్తారు. భద్రాచలం స్పెషల్ సబ్ జైలు, కరీంనగర్ జిల్లా జైలులో ఈ తయారీ యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. మార్కెట్ డిమాండ్ మేరకు కొత్తగా భద్రాచలం స్పెషల్ సబ్ జైలులో కొత్తగా ధూప్‌స్టిక్‌ల తయారీ ప్రారంభించారు. అయితే భక్తులకు మరింత చేరువయ్యేందుకు ఆలయాల వద్ద స్టాళ్ల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగానే భద్రాద్రి రామయ్య ఆలయం వద్ద స్టాల్ ఏర్పాటుకు అనుమతించాలని దేవాదాయ శాఖను కోరినట్లు తెలిపారు. ఈ తయారీ యూనిట్లలో పనిచేసే ఖైదీలకు ఒక్కో ప్యాకెట్‌పై రూ.2చొప్పున వేతనం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.
మానసిక మార్పుకోసమే
‘‘ఖైదీల మానసిక స్థితిలో మార్పు కోసమే ఈ వినూత్న ప్రయోగం చేపట్టాం. ఇతర వస్తువుల ఉత్పత్తితో పోలిస్తే అగరబత్తుల తయారీ ఎంతో ప్రత్యేకమైంది. జైలుకు వచ్చే వారు ఎంతో మానసిక సంఘర్షణతో ఉంటారు. దైవకార్యానికి ఉపయోగపడే ఇలాంటి పనుల్లో నిమగ్నం చేయడం వల్ల వారి ఆలోచనా దృక్పఽథం మారుతుంది’’ అని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు.