Kaleshwaram Barrage Renovation Designs: ఆఫ్రీ ఇండియాకుకాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల బాధ్యత
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:27 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లబ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్థరణ ప్రణాళికను అందించే బాధ్యతను ముంబైకి చెందిన ఆఫ్రీ ఇండియాకి కట్టబెట్టాలని సర్కారు నిర్ణయించింది.
9 నెలల్లోగా డి జైన్లు ఇవ్వాలని కోరిన సర్కారు
ఒప్పందం చేసుకోవాలని సీఈకి లేఖ
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లబ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్థరణ ప్రణాళికను అందించే బాధ్యతను ముంబైకి చెందిన ఆఫ్రీ ఇండియాకి కట్టబెట్టాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని రామగుండం చీఫ్ ఇంజనీర్‌కు లేఖ రాసింది. బ్యారేజీల పునరుద్ధరణకు సంబందిఇంచిన డిజైన్లు తొమ్మిది నెలల్లోగా అందించాలని ఆఫ్రీ ఇండియాను ప్రభుత్వం కోరింది. కాగా.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్ మరమ్మతుల విషయంలో అండర్ వాటర్ పనులను ఈ సంస్థే చేయడం గమనార్హం. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లను అందించేందుకు మూడు సంస్థలు ముందుకు రాగా.. వాటి సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాలపై అధికారులు మూల్యాంకనం చేసి, అంశాలవారీగా పాయింట్లు ఇచ్చారు. ఇందులో ఆఫ్రీ ఇండియా(ముంబై) ముందు వరుసలో ఉండటంతో ఆ సంస్థకే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు అందించే బాధ్యతను కట్టబెట్టాలని నిర్ణయించారు. బ్యారేజీ పటిష్ఠతపై మదింపు, హైడ్రాలజీ, హైడ్రాలిక్ రివ్యూ, వరదలు/భూకంపాలు వంటి విపత్తులను ఎదుర్కోవడంలో బ్యారేజీల సామర్థ్యం మదింపు, గేట్లు/పియర్లు/స్టిలింగ్ బేసిన్/కటాఫ్ వాల్స్ వంటి బ్యారేజీలోని కీలక విభాగాలను పటిష్ఠం చేసే డిజైన్లు అందించడం వంటి సేవలను ఈ సంస్థ అందించనుంది. బ్యారేజీల ప్రస్తుత డిజైన్లతో పాటు ఎన్‌డీఎ్‌సఏ నివేదికల్లోని సిఫారసులను పునఃసమీక్షించడం, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పర్యటించి భూసాంకేతిక, భూభౌతిక పరీక్షలు నిర్వహించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే.. బ్యారేజీల వద్ద పరీక్షలు చేసే కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్- పుణే)కు సహకారం అందించాల్సి ఉంటుంది. ఈ సంస్థ డిజైన్లు అందించగానే వాటిని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కి అందించి, మదింపు చేసుకోనున్నారు. ఆ తర్వాత బ్యారేజీల పునరుద్ధరణ/మరమ్మతుల ప్రక్రియ ముందుకెళ్లనుంది. అఫ్రీ ఇండియాకు పునరుద్ధరణ డిజైన్లు అందించడానికి వీలుగా ప్రభుత్వం పరిపాలనపర అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.