Share News

రేపటి నుంచి ఏరోమార్ట్‌ సదస్సు

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:53 AM

విమానయానం, రక్షణ రంగాల్లో దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌ వేదికగా సమావేశం కానున్నాయి. దీనికి సంబంధించి జూన్‌ 30 నుంచి జూలై 2 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌....

రేపటి నుంచి ఏరోమార్ట్‌ సదస్సు

  • 25 దేశాల నుంచి ప్రతినిధుల రాక

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి) : విమానయానం, రక్షణ రంగాల్లో దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌ వేదికగా సమావేశం కానున్నాయి. దీనికి సంబంధించి జూన్‌ 30 నుంచి జూలై 2 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ‘‘ఏరో మార్ట్‌ హైదరాబాద్‌ 2026’’ పేరుతో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. విదేశీ కంపెనీలు, వాటికి విడిభాగాలు సరఫరా చేసే భారతీయ సంస్థలు ఇక్కడ కలుసుకుని కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటాయని సంబంధిత అధికారులు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సదస్సుకు 25 దేశాల నుంచి 400కు పైగా కంపెనీలు, 1,200 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. భారత్‌ ప్రపంచంలో విమానయాన తయారీ రంగంలో వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటిగా మారింది. అందుకనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ‘‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’’ పేరుతో దేశీయంగా ఉత్పత్తి రంగాన్ని విస్తృత పర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. రక్షణ సామగ్రిని ఎక్కువగా దేశంలోనే తయారుచేయడం, విమానయాన రంగం విస్తరించడం, ఎగుమతులు పెరగడం వంటి కారణాలతో విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం భారతీయ సంస్థలవైపు చూస్తున్నాయి. ఈ సదస్సు వల్ల భారతీయ చిన్న - మధ్య తరహా కంపెనీలకు మంచి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సును అడ్వాన్స్‌డ్‌ బిజినెస్‌ ఈవెంట్స్‌(ఏబీఈ), బీసీఐ ఏరోస్పేస్‌ సంస్థలు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రైజింగ్‌, టీజీఐఐసీ సహకారంతో నిర్వహిస్తున్నాయి.

Updated Date - Jun 29 , 2026 | 04:53 AM