అర్వింద్ తమ్ముళ్ల అరాచకాలపై మేం మాట్లాడలేమా?
ABN , Publish Date - May 20 , 2026 | 03:34 AM
బాధ్యతగల నేతగా రాష్ట్ర ప్రజల హక్కులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రైతుల సమస్యలపై మాట్లాడాల్సిన ధర్మపురి అరవింద్..
చేతనైతే కేంద్రం నుంచి మక్కలకు మద్దతు ధర ఇప్పించు: అడ్లూరి
హైదరాబాద్, మే 19(ఆంధ్రజ్యోతి): బాధ్యతగల నేతగా రాష్ట్ర ప్రజల హక్కులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రైతుల సమస్యలపై మాట్లాడాల్సిన ధర్మపురి అరవింద్.. సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. అసలు అర్వింద్ కుటుంబ రాజకీయ ప్రస్థానమే కాంగ్రెస్‌తో మొదలైందని.. బీజేపీ మాదిరిగా నాగ్‌పూర్ ఆదేశాలను అమలు చేసే పార్టీ తమది కాదని, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే ప్రజాస్వామిక పార్టీ అని పేర్కొన్నారు. మక్కలు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బీజేపీ ఎంపీగా అర్వింద్‌కు చేతనైతే కేంద్రంతో మాట్లాడి మక్కలకు మద్దతు ధర ఇప్పించాలని సవాలు చేశారు. సీఎం రేవంత్ తమ్ముళ్ల గురించి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నిజామాబాద్‌లో అరవింద్ తమ్ముళ్ల అరాచకాల గురించి తాము మాట్లాడలేమా? అని ప్రశ్నించారు. మూడోసారి అధికారంలోకి వస్తామంటూ అహంకారంగా మాట్లాడిన బీఆర్‌ఎస్ నాయకత్వం మెడలువంచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అని అన్నారు. గ్రామస్థాయి రాజకీయాల నుంచి టీపీసీసీ అధ్యక్షునిగా ఎదిగి, ప్రజల ఆశీర్వాదంతో సీఎం అయిన నేత అంటూ కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గుండుతో ఎండలో తిరిగిన ధర్మపురి అరవింద్.. వడదెబ్బ ప్రభావంతో సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.