Share News

నువ్వు మేనేజ్‌మెంట్‌ కోటా.. రేవంత్‌ మెరిట్‌ కోటా

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:54 AM

పదేళ్ల పాటు కేటీఆర్‌ రాజులా విర్రవీగారని.. ఆమెరికా నుంచి నేరుగా వచ్చి స్థానిక నేత మహేందర్‌రెడ్డి టికెట్‌ లాక్కుని ఎన్‌ఆర్‌ఐ కోటాలో తెలంగాణలో పోటీ చేశారే...

నువ్వు మేనేజ్‌మెంట్‌ కోటా.. రేవంత్‌ మెరిట్‌ కోటా

  • మీ హయాంలో ఒక్క గురుకుల భవనమైనా నిర్మించారా!

  • కేటీఆర్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ విమర్శలు

హైదరాబాద్‌, మే 31(ఆంద్రజ్యోతి): పదేళ్ల పాటు కేటీఆర్‌ రాజులా విర్రవీగారని.. ఆమెరికా నుంచి నేరుగా వచ్చి స్థానిక నేత మహేందర్‌రెడ్డి టికెట్‌ లాక్కుని ఎన్‌ఆర్‌ఐ కోటాలో తెలంగాణలో పోటీ చేశారే తప్ప ఆయనకు ప్రజాస్వామ్యంపై అవగాహన లేదన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సీఎం స్థాయి వరకు ఒక్కోమెట్టు ఎక్కుతూ మెరిట్‌ కోటాలో ప్రజాదరణతో ఈ స్థాయికి వచ్చారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క గురుకుల పాఠశాలకైనా సొంత భవనాన్ని నిర్మించినట్లు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. వారి హయాంలో గురుకులాల సంఖ్యను పెంచి, మౌలిక వసతులను గాలికొదిలేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన గురుకులాలన్నీ నేటికీ అద్దె భవనాల్లో మగ్గుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే గురుకులాల్లో డైట్‌ ఛార్జీలు పెంచామని, సరైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. దళితులపై బీఆర్‌ఎ్‌సకి ఉన్న ప్రేమ ఎలాంటిదో గతంలోనే రుజువైందని, కొప్పుల ఈశ్వర్‌ను అప్పట్లో కేసీఆర్‌ మీడియా ముందే అవమానించిన ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. కేవలం 38వేలమందికే దళితబంధు ఇచ్చి అందరికీ ఇచ్చేశామంటూ కేటీఆర్‌ ప్రగల్పాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు.

Updated Date - Jun 01 , 2026 | 04:54 AM