kumaram bheem asifabad- ఆదివాసీ ఆచారాలు ఆదర్శనీయం
ABN , Publish Date - Aug 09 , 2026 | 10:25 PM
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు సమాజంలో ఆదర్శనీయమని, వాటిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఎస్పీ నితికా పంత్, జిల్లా అటవీ అధికారి బలాఆమణి, శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా గ్రంథాయసంస్థ ఛైర్మన్ కామ్డె అనిల్, ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై జెండా వద్ద ఆదివాసీల సంప్రదాయ బద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు సమాజంలో ఆదర్శనీయమని, వాటిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని కలెక్టర్ హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఎస్పీ నితికా పంత్, జిల్లా అటవీ అధికారి బలాఆమణి, శాసనమండలి సభ్యులు దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా గ్రంథాయసంస్థ ఛైర్మన్ కామ్డె అనిల్, ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో కలిసి హాజరై జెండా వద్ద ఆదివాసీల సంప్రదాయ బద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది తెగల అమరుల చిత్రపటాలకు, కుమరం భీం చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు విద్య, వైద్యం, తాగునీరు, రవాణా సదుపాయం ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆదివాసీలు ఈ ప్రపంచంలో అతి పురాతనమైన జాతి అని వారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ప్రత్యేకమైనవన్నారు. వాటిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలన్నారు. కార్పొరేట్ సంస్థలతో మాట్లాడి ఇక్కడి గిరిజన యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గిరిజనులువిద్య ఉపాధి రంగాలలో రాణించాలన్నారు.
ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ ప్రపంచంలో ఆదివాసీల సంస్కృతి, జీవనశైలి, ఆచారాలు, అలవాట్లు విభిన్నమైనవని అన్నారు. అన్ని జాతుల వారికి ఆదర్శనీయమని తెలిపారు. పోలీసులు ఎప్పుడు ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తారని వివరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్‌ను బంగారుమయంగా మలచుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి ఇంద్రవెల్లి స్మారక స్తూపం అభివృద్ధికి రూ. కోటి మంజూరు చేసి అమరులైన కుటుంబాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించారని చెప్పారు. పీవీటీజీలకు పీఎం జన్మన్ కింద వందశాతం ఇందిరమ్మ ఇళళ్ల ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో అటవీ అధికారులు అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నారన్నారు. 20, 30 ఏళ్ల క్రితం నుంచి సాగు చేసుకుంటున్న పోడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆదివాసీలు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. అడవులతోనే ఆదివాసీల జీవితం ముడిపడి ఉందన్నారు. అలాంటి ఆదివాసీలను అడవి నుంచి వారిని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. వీటిని తిప్పి కొట్టడానికి కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. ఎమ్మెల్యే హరిష్‌బాబు మాట్లాడుతూ ఆదివాసీల కోసం తయారుచేసిన చట్టాలు క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గొప్పగా వెలిగిన ఐటీడీఏ ప్రస్తుతం ఉత్సవ విగ్రహంలా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆదివాసీల హక్కుల రక్షణ కోసం షెడ్యూల్ ఐదు తీసుకువచ్చిందని వివరించారు. దీని ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో ఐదు శాతం ఆదివాసీల అభివృద్ది కోసం కేటాయించాలన్నారు. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు ఎక్కువగా ఎస్టీలు ఉన్న ఆసిఫాబాద్‌కు ఇవ్వకుండా పక్కన ఉన్న మంచిర్యాల జిల్లాకు ఇవ్వడం ఏంటనిర పశ్నించారు. అంతకు ముందు ఆదివాసీలు జూబ్లీ మార్కెట్‌లోని రాయిసెంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలతో అంబేద్కర్‌చౌక్ నుంచి ఆదివాసీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కుమరం భీం చౌక్‌లోని భీం విగ్రహానికి కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆదివాసీ సంఘాల నాయకులు నివాళులర్పించారు. కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే, ఎస్పీ, డీసీసీ అధ్యక్షురాలు చేసిన నృత్యం అలరించింది. గిరిజన విద్యార్థులు, గుస్సాడీ బృందాలు ప్రదర్శించిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన అభివృద్ధి అధికారి జాదవ్ అంబాజీ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్‌ఛైర్మన్ అహ్మద్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, పీఏసీఎస్ ఛైర్మన్ అలీబీన్ ఆహ్మద్, కలెక్టర్ భర్త, రిటైర్డ్ ఏఎస్పీ చిట్టిబాబు, బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, ఆదివాసీ సంఘాల నాయకులు సిడాం అర్జు, మర్సుకోల సరస్వతి, పెందూరు గోపి, భీంరావు, సుధాకర్, ప్రేంకుమార్, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, డీఎంహెచ్‌వో నాగేంద్ర, సర్పంచ్ బుర్స పోచయ్య పాల్గొన్నారు.