Share News

ఆదిలాబాద్‌లో వాయుసేన పైలట్లకు శిక్షణ!

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:15 AM

ఆదిలాబాద్‌ అతి త్వరలో భారత వాయుసేన పైలట్లకు శిక్షణ కేంద్రంగా మారబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు సమీపంలోని హకీంపేట, దుండిగల్‌లో ఐఏఎఫ్‌ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.

ఆదిలాబాద్‌లో వాయుసేన పైలట్లకు శిక్షణ!

  • హకీంపేట, దుండిగల్‌లోని శిక్షణ కేంద్రాలకు అనుబంధంగా మరో కేంద్రం

  • సివిల్‌ ఏవియేషన్‌ పరిధిలో ఉన్న పైలట్‌ శిక్షణ కేంద్రాలు వరంగల్‌కు

  • హైదరాబాద్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ నేపథ్యంలో ప్రతిపాదనలు

హైదరాబాద్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ అతి త్వరలో భారత వాయుసేన పైలట్లకు శిక్షణ కేంద్రంగా మారబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు సమీపంలోని హకీంపేట, దుండిగల్‌లో ఐఏఎఫ్‌ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు అనుబంధంగా ఆదిలాబాద్‌లోని ప్రతిపాదిత కొత్త విమానాశ్రయం వద్ద ఐఏఎఫ్‌ యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌ పైలట్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతుంది. అలాగే, ప్రభుత్వానికి అనుబంధంగా సివిల్‌ ఏవియేషన్‌ పరిధిలో ఉన్న పైలట్‌ శిక్షణ కేంద్రాలు వరంగల్‌లో ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్‌, బేగంపేటలో మాత్రమే విమానాశ్రయాలు ఉన్నాయి. వరంగల్‌ జిల్లా మామునూరులో విమానాశ్రయ నిర్మాణానికి ఆమోదం లభించింది. ఆదిలాబాద్‌ విమానాశ్రయం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు దగ్గర్లో ఉన్న పైలట్‌ శిక్షణ సంస్థలు ఆదిలాబాద్‌, మామునూరుకు వెళ్లాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పైలట్ల ట్రైనింగ్‌ సెంటర్‌ కోసం మామునూరులో ఇప్పటికే ప్రత్యేక నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించగా, ఆదిలాబాద్‌లో వాయుసేన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తీసుకున్న నిర్ణయాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రైవేటు ట్రైనింగ్‌ సెంటర్లను కూడా తమ రెండో కేంద్రంగా ఆదిలాబాద్‌, మామునూరును ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నట్టు తెలిసింది.


రెండు చోట్లా ట్రైనింగ్‌ సెంటర్లు

హకీంపేటలో దాదాపు 1852 ఎకరాల్లో, దుండిగల్‌లో 2వేల ఎకరాలకు పైగా భూముల్లో పైలట్‌ శిక్షణ సంస్థలు ఏళ్లుగా కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. పౌర విమానయాన శాఖ పరిధిలోని ట్రైనింగ్‌ సెంటర్‌ బేగంపేట కేంద్రంగా నడుస్తోంది. ఎయిర్‌ ట్రాఫిక్‌ వల్ల ఈ కేంద్రాల్లోని విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా విమానాలను నడపడటం కుదరడం లేదు. బేగంపేట, శంషాబాద్‌ విమానాశ్రయాల్లో నిత్యం పెద్ద సంఖ్యలో విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఎయిర్‌ట్రాఫిక్‌ చాలా అధికంగా ఉంటోంది. ఫలితంగా హకీంపేట, దుండిగల్‌ కేంద్రాల పరిధిలో యుద్ధ విమానాలు నడపడం నేర్చుకునే వారికి, సివిల్‌ ఏవియేషన్‌ పరిధిలో శిక్షణ తీసుకుంటున్న వారికి ఎయిర్‌ స్లాట్‌లు దొరకడం లేదు. రోజుకు 3-4సార్లు ట్రయల్స్‌కు వెళ్లాల్సిన వారు ఒక్కసారికే పరిమితమవుతున్నారు. ఎప్పుడో ఓసారి రోజుకు 2-3 సార్లు ఎయిర్‌ట్రాఫిక్‌ స్లాట్‌ లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే శిక్షణ కేంద్రాలను వరంగల్‌, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుల పరిధిలోకి మార్చాలనే ప్రతిపాదన వచ్చిందని అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే హకీంపేట, దుండిగల్‌లో ఉన్న కేంద్రాలను అలాగే ఉంచుతూ ఆదిలాబాద్‌లో మరో ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు ఉంటాయని సమాచారం. భారత వాయుసేనకు నాగపూర్‌, హైదరాబాద్‌ కేంద్రంగా శిక్షణ కేంద్రాలు ఉన్నాయి.


ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఆదిలాబాద్‌లో మరో కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే నాగపూర్‌, హైదరాబాద్‌ కేంద్రాల్లోని వారికి ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు వల్ల శిక్షణ తీసుకునే వారికి ఆశించిన స్థాయిలో ఎయిర్‌ట్రాఫిక్‌ స్లాట్‌లు లభిస్తాయని అంటున్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని సివిల్‌ ఏవియేషన్‌ సంస్థలో ప్రస్తుతం 100-120 మంది విద్యార్ధులు ఉన్నారు. వారందరికీ బేగంపేట నుంచే ట్రైనింగ్‌ ఇస్తున్నారు. వీరంతా రోజుకు కనీసం 3 సార్లైనా విమానాలు శిక్షణ కోసం నడపాలి. ఎయిర్‌ట్రాఫిక్‌ రద్దీ వల్ల వాళ్లకు కూడా స్లాట్‌ దొరకడంలేదు. అందుకే మామునూరు ఎయిర్‌పోర్టులో సివిల్‌ ఏవియేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ కోసం నిర్మాణాలు చేయనున్నారు. రెండు చోట్ల శిక్షణ కేంద్రాలు ఉండడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు తమ శిక్షణను త్వరగా పూర్తి చేసుకుంటారని, లైసెన్సుల జారీ కూడా వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. కాగా, పైలట్‌ ట్రైనింగ్‌కు సంబంధించి రాష్ట్రంలో మరో మూడు ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. వాటి కేంద్రాలను కూడా మామునూరుకు మార్చుకోవాలని అధికారులు ఆయా సంస్థలకు సూచిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Jun 08 , 2026 | 06:16 AM