Share News

1765 ఎకరాల్లో ఆదిలాబాద్‌ విమానాశ్రయం!

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:15 AM

ఆదిలాబాద్‌లో నిర్మించదలచిన విమానాశ్రయం విస్తీర్ణం విషయంలో రోజుకో మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు 765 ఎకరాలు అవసరమన్నారు.

1765 ఎకరాల్లో ఆదిలాబాద్‌ విమానాశ్రయం!

  • తాజాగా లెక్క తేల్చిన అధికారులు .. ఎయిర్‌స్ట్రిప్‌, టెర్మినల్స్‌కు 765 ఎకరాలు

  • భూసేకరణ పరిహారం నిధులు, భూముల బదలాయింపుపై త్వరలో ఢిల్లీలో సమావేశం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లో నిర్మించదలచిన విమానాశ్రయం విస్తీర్ణం విషయంలో రోజుకో మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు 765 ఎకరాలు అవసరమన్నారు. ఆ తర్వాత 1100 ఎకరాలు కావాలన్నారు. ఇప్పుడు మరింత ముందుకెళ్లి 1765 ఎకరాలు అవసరమని తేల్చారు. ఎయిర్‌పోర్డు పరిధిలో వాయుసేన వినియోగానికి ఒకటి, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పరిధిలో ఒకటి చొప్పున రెండు టెర్మినల్స్‌ను, ఒక ఎయిర్‌స్ట్రి్‌పను నిర్మించనున్నారు. రక్షణశాఖకు ఇది వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్నందున ఇక్కడ విమానాశ్రయంతో పాటు రక్షణశాఖకు చెందిన సిబ్బంది క్వార్టర్స్‌, వారి పిల్లలకు స్కూలు, కాలేజీ, విమానాల పార్కింగ్‌, ట్రైనింగ్‌ సెంటర్‌, విమానాల విడిభాగాల బిగింపు వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని తాజాగా కేంద్రం నిర్ణయించినట్టు తెలిసింది. అంటే ఎయిర్‌పోర్టుతోపాటు ఓ టౌన్‌షి్‌ప కూడా ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలోనే, నిర్మాణానికి అవసరమైన భూమి 1765 ఎకరాలకు పెరిగింది. ఇందులో 765 ఎకరాలను ఎయిర్‌పోర్టు కోసం, వెయ్యి ఎకరాలను రక్షణశాఖ టౌన్‌షిప్ కోసం వినియోగించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇప్పటికే అక్కడ ఉన్న ఏరోడ్రోమ్‌ పరిధిలో 370 ఎకరాల భూమి ఉంది. ఇదిగాక అదనంగా 1395 ఎకరాలు అవసరమని తేల్చారు. అయితే, గతంలో ఉన్న అంచనాల ప్రకారం ఏరోడ్రోమ్‌ పరిధిలోని భూమికి అదనంగా 700 ఎకరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2025 నవంబర్‌ 3న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పుడు అదనపు భూమి కింద వెయ్యి ఎకరాలు అవసరమని తేలటంతో.. ఈ భూ సేకరణకు చెల్లించే పరిహారం నిధులను రక్షణశాఖ అందిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అదనపు భూసేకరణ కింద అవసరమైన భూములు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి? ప్రభావితమయ్యే రైతులు ఎంత మంది? అన్నదానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.


సీసీఐ పరిధిలో 800 ఎకరాలు

ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పరిధిలో దాదాపు 800 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఆ కంపెనీ వినియోగంలో లేదు కాబట్టి ఆ భూములను రక్షణశాఖకు తరలించాలనే ఓ ప్రతిపాదన వినిపిస్తోంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతిస్తే అదనపు భూసేకరణ వ్యవహారం కొలిక్కివచ్చినట్టే. మిగిలిన 200 ఎకరాలను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. భూ సేకరణ పరిహారం చెల్లింపునకు కేంద్రం ఆమోదిస్తే.. విమానాల పార్కింగ్‌, ఇంధనంపై రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు అంశంపై ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, రామ్మోహన్‌ నాయుడు, కిషన్‌రెడ్డి అధికారులతో సమావేశమై సమీక్షించారు. పది రోజుల్లో కీలక భేటీ జరగనున్నట్లు సమాచారం.

ఎయిర్‌పోర్టుతో జిల్లా అభివృద్ధి

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు కేంద్రం సుముఖంగా ఉంది. ఏరోడ్రోమ్‌ పరిధిలో ఉన్న భూములకు అదనంగా మరికొంత భూమి అవసరమవుతోంది. ఆ భూములకు చెల్లించే పరిహారం నిధులు, సీసీఐ పరిధిలో ఉన్న భూములను రక్షణశాఖకు తరలించే అంశంపై ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణం ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి మరింత దోహదం కానుంది.

- పాయల్‌ శంకర్‌, ఎమ్మెల్యే, ఆదిలాబాద్‌

Updated Date - Apr 22 , 2026 | 05:15 AM