ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:46 AM
ఆదిలాబాద్‌లో విమానశ్రయ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ ముందుకు వచ్చిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.
వీలైనంత త్వరగా శంకుస్థాపన
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టెర్మినల్
కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, కిషన్‌రెడ్డి వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లో విమానశ్రయ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ ముందుకు వచ్చిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్ వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం కావడంతో శిక్షణ కేంద్రంతో పాటు, పౌర విమానాల సేవల కోసం అభివృద్ధి చేయాలని రక్షణశాఖ ప్రతిపాదించిందని మంత్రి తెలిపారు. సామాన్య ప్రజల కోసం ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) టర్మినల్ బిల్డింగ్ నిర్మిస్తుందన్నారు. ఈ నెల 17న.. విమానయాన, రక్షణ శాఖ అధికారులతో కూడని బృందం ఆదిలాబాద్‌లో పర్యటించి ఓఎల్‌ఎస్ సర్వే చేస్తారని, అనంతరం రన్‌వే ఓరియంటేషన్, మాస్టర్‌ప్లాన్ ఖరారు చేస్తారని వెల్లడించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన అదనపు 450 ఎకరాల భూమిని రాష్ట్రప్రభుత్వం త్వరగా అప్పగించాలని కోరామని, అందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని తెలిపారు. తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న ఆదిలాబాద్‌లో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే భవిష్యత్‌లో వాణిజ్యపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు ఒకే విమానశ్రయం ఉందన్న భావన ప్రజల్లో ఉందని, వారి డిమాండ్‌కు అనుగుణంగా.. విమానశ్రయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. వరంగల్‌లో మామునూరు విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, మరో 3 నెలల్లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నామని తెలిపారు. పెద్దపల్లిలోని అంతర్గాం వద్ద ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు నిర్వహించిన అధ్యయనంలో సానుకూల ఫలితాలు వచ్చాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తుదినిర్ణయం కోసం వేచి చూస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగూడెంలో ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయానికి అనుకూలం కాదని స్పష్టం చేశారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, కిషన్‌రెడ్డి, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.