Share News

కేసీఆర్‌ చట్టానికి సహకరించాల్సిందే: ఆది శ్రీనివాస్‌

ABN , Publish Date - Jan 30 , 2026 | 03:59 AM

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉందని, ఆయన చట్టానికి సహకరించాల్సిందేనని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

కేసీఆర్‌ చట్టానికి సహకరించాల్సిందే: ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చే అధికారం సిట్‌కు ఉందని, ఆయన చట్టానికి సహకరించాల్సిందేనని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ లబ్ధిదారులుగా కనిపిస్తున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లుగా హరీశ్‌రావు మాట్లాడుతున్నాడు. ఆయనకు నోటీసులు ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు దెబ్బతింటుంది’ అంటూ నిలదీశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లుగా స్వయంగా ఆయన కూతురు కవితే చెప్పారని గుర్తు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆధారాలున్నాయి కాబట్టే కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చిందని తెలంగాణ ఎంపీల ఫోరం కన్వీనర్‌ మల్లు రవి అన్నారు. ఇదే కేసులో హరీశ్‌, కేటీఆర్‌ సహా పలువురిని సిట్‌ విచారించిందని, ఆ సమాచారం మేరకే కేసీఆర్‌ను విచారించాలని దర్యాప్తు సంస్థ భావిస్తోందని తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌తో లబ్ధి పొందింది కేసీఆరేనని, అందుకే ఆయన్ను సిట్‌ విచారణకు పిలిచిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ అన్నారు. సిట్‌ విచారణకు, సీఎం రేవంత్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ నేతలు అన్నంత మాత్రాన కేసీఆర్‌ జాతిపిత అయిపోరని ఆయనేమిటో ,ప్రజలకు తెలుసని ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 03:59 AM