అదనపు కలెక్టర్ అక్రమార్జన 50కోట్ల పైనే !
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:57 AM
హన్మకొండ అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వెంకటరెడ్డి అక్రమార్జన ఏకంగా కోట్లలో బయటపడింది.
ఖరీదైన విల్లా, లగ్జరీ ఫ్లాట్, ఇళ్ల స్థలాలు
14.5 ఎకరాల వ్యవసాయ భూమి
ఆరు చోట్ల ఏసీబీ తనిఖీల్లో గుర్తింపు
హైదరాబాద్/మిర్యాలగూడ/నార్సింగ్/వరంగల్ క్రైం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): హన్మకొండ అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వెంకటరెడ్డి అక్రమార్జన ఏకంగా కోట్లలో బయటపడింది. ఆయన పనిచేసిన కార్యాలయం, నివాసం, బంధువులు, మిత్రులు, బినామీల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో ఆరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.50 కోట్లపైనే అక్రమాస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గత నెల 5న వెంకటరెడ్డి లంచం తీసుకుంటూ పట్టుబడిన తర్వాత ఏసీబీ అధికారులు తదుపరి విచారణ జరిపి ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేశారు. ఈ క్రమంలో బుఽధవారం హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి-మేడ్చల్, వరంగల్, హన్మకొండ, నల్లగొండ జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దీంతో ఆయన అక్రమార్జనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటరెడ్డి తన బినామీల పేరిట రూ.4.65 కోట్ల ఖరీదైన విల్లా, ఒక లగ్జరీ ఫ్లాట్, రూ.60 లక్షల విలువైన క మర్షియల్ షాపు, వివిధ ప్రాంతాల్లో రూ.65 లక్షల విలువైన 8 ఇళ్ల స్థలాలు, రూ.50 లక్షల విలువైన 14.5 ఎకరాల వ్యవసాయ భూమిని ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ రూ.50 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవే కాకుండా వెంకటరెడ్డి ఇంట్లో 30లక్షల నగదు, ఆరు బ్యాంకు ఖాతాల్లో రూ.44లక్షలు, రూ11లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.40లక్షల విలువైన మూడు కార్లు, రూ.4.35లక్షల విలువైన 297గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించామని ఏసీబీ డీజీ చారుసిన్హా తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆయన ఆస్తులు రూ.7,69,38,332గా గుర్తించామని తెలిపారు. వెంకటరెడ్డి గతంలో నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న క్రమంలో ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదైంది. ఆకేసులోంచి బయటపడిన తర్వాత మళ్లీ వెంకటరెడ్డి అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.