Corruption: అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశాల మేరకే లంచం
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:56 AM
పౌర సరఫరాల శాఖ సంస్థ మేనేజర్ జగన్మోహన్ ఏసీబీకి చిక్కిన కేసు కీలక మలుపు తిరిగింది. అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశాల మేరకే లంచం తీసుకున్నట్లు జగన్మోహన్....
ఏసీబీ విచారణలో పౌరసరఫరాల శాఖ సంస్థ మేనేజర్ వెల్లడి
అడిషనల్ కలెక్టర్‌ను 4గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు
వనపర్తి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): పౌర సరఫరాల శాఖ సంస్థ మేనేజర్ జగన్మోహన్ ఏసీబీకి చిక్కిన కేసు కీలక మలుపు తిరిగింది. అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశాల మేరకే లంచం తీసుకున్నట్లు జగన్మోహన్ విచారణలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీవిశ్వనాథ్‌ను విచారించారు. ఆ సమయంలో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ అందుబాటులో లేరు. దీంతో ఆయన్ను శుక్రవారం పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయానికి పిలిపించి, 4గంటల పాటు విచారించారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణను వివరణ కోరగా సమగ్ర దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సీఎంఆర్ కేటాయింపు కోసం ఓ మిల్లర్ నుంచి గురువారం రాత్రి జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ జగన్మోహన్ రూ.50 లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటనలో జగన్మోహన్‌తో పాటు కారు డ్రైవర్ లక్ష్మణ్ నాయక్‌లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.