Share News

ఏడీఏ అక్రమార్జన 40 కోట్లు!

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:51 AM

ఆదాయానికి మించిన ఆస్తులు గల వ్యవసాయశాఖ నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి డివిజన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుందరి కిరణ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

ఏడీఏ అక్రమార్జన  40 కోట్లు!

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యవసాయ శాఖ కల్వకుర్తి ఏడీఏ అరెస్టు

  • 8 70 ఎకరాల భూమి, 3 ఇళ్ల స్థలాలు,

  • 2 ఫ్లాట్లు, ఓ లగ్జరీ ఇల్లు గుర్తింపు

హైదరాబాద్‌/ కల్వకుర్తి/ గరిడేపల్లి/నేరేడుచర్ల/ అనంతగిరి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తులు గల వ్యవసాయశాఖ నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి డివిజన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుందరి కిరణ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం సుందరి కిరణ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఏడుచోట్ల సోదాలు జరిపారు. ఒక సాధారణ ప్రభుత్వ అధికారి సుందరి కిరణ్‌కుమార్‌కు 97 ఎకరాల వ్యవసాయ భూమి ఉండటంతో నివ్వెర పోవడం ఏసీబీ అధికారుల వంతైంది. దీంతోపాటు ఈ తనిఖీల్లో 3 ఇళ్ల స్థలాలు, 5 వాహనాలు, రూ.5.50 లక్షల విలువైన బీమా పాలసీలు, రూ.50 లక్షల పెట్టుబడుల పత్రాలు, రెండు అపార్టుమెంట్‌ ప్లాట్లు, ఒక లగ్జరీ ఇల్లు గుర్తించామని ఏసీబీ డీజీ చారుసిన్హా చెప్పారు. డాక్యుమెంట్ల ప్రకారమే ఈ ఆస్తుల విలువ రూ.4 కోట్లు.. మార్కెట్‌ ధర ప్రకారం రూ.40 కోట్ల పై చిలుకే ఉంటుందన్నారు. కిరణ్‌ కుమార్‌, ఆయన కుటుంబ సభ్యుల బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందన్న చారుసిన్హా.. ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లపల్లిలో అవని రైసుమిల్లులో 2020 వరకూ కిరణ్‌ తండ్రి కోటేశ్వరరావు భాగస్వామి.


రైసుమిల్లుకు నాటి మేనేజింగ్‌ పార్టనర్‌ దేవిరెడ్డి వెంకటరెడ్డిని మిల్లు వద్దకు పిలిపించి ఏసీబీ అధికారులు విచారించారు. అనంతగిరి మండలం అమీనాబాద్‌లోని కిరణ్‌ వియ్యంకుడు, విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట్లో 6 గంటలు సోదాలు జరిపి కీలక పత్రాలను పరిశీలించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో కిరణ్‌ సొంతూరు పొనుగోడు, అత్త గారి గ్రామం గడ్డిపల్లి, నేరేడుచర్ల మండలం చిల్లపల్లి అవని రైస్‌మిల్‌, అనంతగిరి మండం అమీనాబాద్‌, సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన అద్దెకున్న ఇంటిలో తనిఖీలు చేశారు. కిరణ్‌ కుమార్‌ తన సర్వీసులో ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయన రెండేళ్ల క్రితం ఏడీఏగా బదిలీపై కల్వకుర్తికి వచ్చారు. అంతకు ముందు సూర్యాపేట జిల్లా డీఆర్‌డీఏ పీడీగా ఉన్నప్పుడు అక్రమాస్తులు కూడబెట్టారని కిరణ్‌ కుమార్‌పై అభియోగం. సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారులు తమ వెంట కీలక పత్రాలను తీసుకెళ్లినట్లు సమాచారం.

Updated Date - Feb 22 , 2026 | 05:52 AM