Share News

సినీనటి అషురెడ్డిపై కేసు!

ABN , Publish Date - Apr 27 , 2026 | 04:47 AM

సినీనటి అఘరెడ్డి(వెంకట అశ్వినిరెడ్డి కొయ్య)పై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కుమారుడి నుంచి రూ.9.35 కోట్ల మేర వసూలు ....

సినీనటి అషురెడ్డిపై కేసు!

  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐటీ ఉద్యోగి నుంచి రూ.9.35 కోట్లు వసూలు

  • పోలీసులకు బాధితుడి తండ్రి ఫిర్యాదు

  • బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తన కొడుకుని హనీట్రాప్‌ చేశారని ఆరోపణ

  • డబ్బు తిరిగివ్వమంటే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని వెల్లడి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): సినీనటి అఘరెడ్డి(వెంకట అశ్వినిరెడ్డి కొయ్య)పై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కుమారుడి నుంచి రూ.9.35 కోట్ల మేర వసూలు చేసిందంటూ యెనుముల సత్యనారాయణ అనే వ్యక్తి అషురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు వైవీ ధర్మేంద్ర లండన్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. ధర్మేంద్ర 2018లో స్వదేశానికి వచ్చినప్పుడు స్నేహితుల ద్వారా అషురెడ్డితో పరిచయమైంది. ఆ పరిచయం పెరగడంతో ఇరువురు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ సందర్భంలో ధర్మేంద్ర తనకు గతంలో పెళ్లి జరిగిన విషయం, విడాకుల కోసం యత్నిస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత కూడా పెళ్లికి అంగీకరించిన అషురెడ్డి.. హైదరాబాద్‌లో తన ఖర్చులకు, చదువు కోసం తీసుకున్న విద్యా రుణం చెల్లించడానికి సహకరించాలని ధర్మేంద్రను కోరింది. అషురెడ్డిని త్వరలో పెళ్లి చేసుకుంటాననే నమ్మకంతో ధర్మేంద్ర ఆమె అడిగిన డబ్బును పంపాడు. బంగారం, ఇల్లు కొనుగోలుకు సహకరించాడు. అయితే, 2020 జూలైలో పెళ్లి ముహుర్తాలు పెట్టుకుందామని ధర్మేంద్ర ప్రతిపాదించగా.. తనకు పెళ్లి ఇష్టం లేదని అషురెడ్డి చెప్పింది. దీంతో తాను ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని ధరేంద్ర కోరగా.. మరో నటిని మధ్యవర్తిగా పెట్టి మాట్లాడించిన అషురెడ్డి రూ.70 లక్షలు తిరిగిచ్చేందుకు అంగీకరించి చెక్కులు ఇచ్చింది. ఆ తర్వాత చెక్కులు చించేసి డబ్బులు ఇవ్వనని మొండికేసింది. అయితే, అషురెడ్డి తల్లి యశోద రెడ్డి, సోదరి దివ్య రెడ్డి 2020 నవంబరులో ధర్మేంద్రతో మాట్లాడారు. జరిగినవన్నీ మరచిపోవాలని అషురెడ్డిని పెళ్లికి ఒప్పిస్తామని చెప్పి, ఖర్చుల కోసం కొంత డబ్బు అడిగి తీసుకున్నారు. ఆ తర్వాత అషురెడ్డి తిరిగి ధర్మేంద్రకు దగ్గరైంది. అప్పట్నించి 2025 నవంబరు వరకు ధర్మేంద్ర నుంచి డబ్బు వసూలు చేసిన అషురెడ్డి.. ఆ తర్వాత పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. దీంతో జరిగిన మోసంపై ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన ఆరేళ్లలో తన కుమారుడు ధర్మేంద్ర నుంచి అషురెడ్డి రూ.9.35 కోట్ల మేర వసూలు చేశారని పేర్కొన్నారు. అషురెడ్డి బాయ్‌ఫ్రెండ్‌ జయంత్‌ సూచనల మేరకు ధర్మేంద్రను హనీట్రాప్‌ చేశారని, తీసుకున్న డబ్బులు తిరిగి అడిగితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Apr 27 , 2026 | 04:47 AM