Lift Irrigation Project in Palamuru: డిండితో పాలమూరు ఎడారి
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:53 AM
పాలమూరును ఎడారిగా మార్చే డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. పాలకులు మారుతున్నా పాలమూరు భవిష్యత్తు మారడం....
ఆ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలి: వక్తలు
పంజాగుట్ట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పాలమూరును ఎడారిగా మార్చే డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. పాలకులు మారుతున్నా పాలమూరు భవిష్యత్తు మారడం లేద ని, అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా అవసరాల కోసం నాగార్జునసాగర్, గోదావరి నీరు తీసుకోవాలన్నా రు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పాలమూ రు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ అధ్యక్షతన ‘డిండి ఎత్తిపోతల పథకం రద్దు కోసం..’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న టీజేఎస్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ.. ‘డిండి ఎత్తిపోతల న్యాయమైంది కాదు. నల్లగొండకు నీటిని ఇవ్వడానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కానీ మహబూబ్‌నగర్ ఆయకట్టును విధ్వంసం చేయవద్దు. శాస్త్రీయంగా అన్ని ప్రాంతాల అవసరాలను పరిగణనలోకి తీసుకోని ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి’ అని అన్నారు. పాలమూరు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సమావేశాలు పెట్టినా ప్రభుత్వం అన్యాయాన్ని గుర్తించట్లేదని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డిని పూర్తి చేస్తామని మాట వరుసకే సీఎం అంటున్నారని.. ఆయన నల్లగొండ రాజకీయ నాయకత్వానికి భయపడ్డారా అని నిలదీశారు.