Share News

aచీట్‌ ఫండ్స్‌....

ABN , Publish Date - May 30 , 2026 | 11:29 PM

జిల్లాలో రోజు రోజుకూ పుట్టుకొస్తున్న కొన్ని చిట్‌ఫండ్‌ కంపెనీలు కస్టమర్లను నిలువునా ముంచుతున్నాయి.

aచీట్‌ ఫండ్స్‌....

-వందల సంఖ్యలో ప్రైవేటుగా చిట్టీల నిర్వహణ

-సాలీనా కోట్లాది రూపాయల టర్నోవర్‌

-గతంలో బోర్డులు తిప్పేసిన దాఖలాలెన్నో..!

-నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం

మంచిర్యాల, మే 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోజు రోజుకూ పుట్టుకొస్తున్న కొన్ని చిట్‌ఫండ్‌ కంపెనీలు కస్టమర్లను నిలువునా ముంచుతున్నాయి. చట్టాల్లో ఉన్న లొసుగుల ఆధారంగా సులువుగా డబ్బు సంపాదించే లక్ష్యంతో ప్రతి యేటా పదుల సంఖ్యలో చిట్‌ఫండ్‌ కంపెనీలు ప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సుమారు వంద వరకు వివిధ కంపెనీలకు చెందిన చిట్‌ఫండ్‌ కంపెనీలకు రిజిస్ర్టేషన్‌లు ఉంటే అందులో మంచిర్యాల జిల్లాలోనే 80కి పైగా కంపెనీల బ్రాంచిలు ఉండటం గమనార్హం. ఇవిగాక ఎలాంటి రిజిస్ట్రేషన్లు, అనుమతులు లేకుండా ప్రైవేటుగా చిట్టీలు నిర్వహించే వాటి సంఖ్య వందల్లోనే ఉంటుం దని అంచనా. సింగరేణి కార్మికులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, గిరిగిరి ఫైనాన్స్‌ నిర్వాహకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రైవేటుగా చిట్టీల దందా నడుపుతుండగా, ఫైనాన్స్‌ కంపెనీలకు అను బంధంగా చిట్టీల వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. కొన్ని ఫైనాన్స్‌ కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్‌లు ఉండగా, వాటిల్లో అక్రమంగా చిట్టీల దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం.

సాలీనా రూ. 100 కోట్లకు పైగా టర్నోవర్‌...

రిజిష్టర్డ్‌ చిట్‌ ఫండ్‌ కంపెనీల ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రతి సంవత్సరం దాదాపుగా రూ.100 కోట్లకుపైగా లావా దేవీలు జరుగుతుంటాయని అంచనా. ఇవిగాక ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే చిట్టీలు మరో రూ. 25 కోట్లకుపైగా ఉంటాయని సమాచారం. రాష్ట్రస్థాయిలో కమిషనర్‌ (రిజిస్ట్రార్‌) ఆఫ్‌ చిట్స్‌ పర్యవేక్షణలో రిజిష్టర్డ్‌ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్‌ నియమ, నిబంధనలకు విరుద్దంగా తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కెంపెనీలు రిజిష్టర్‌ అయినా, వాటిలో నిర్వహించే గ్రూపులకు ఎలాంటి అనుమతులు లేకుండానే చిట్టీల నిర్వహణ చేపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే లాభాపేక్షతో బోర్డులు తి ప్పేయగానే వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో చిట్‌ఫండ్‌ పరిధిలో కనీసం 10 గ్రూపులకు తగ్గకుండా వ్యాపార లావాదేవీలు జరుతుంటాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కం పెనీలకు చెందిన 129 బ్రాంచిలు పని చేస్తుండగా, 957 గ్రూపుల ద్వారా చిట్టీలు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రూపులో రూ. లక్ష మొదలుకొని రూ. 10 లక్షల విలువగల చిట్టీల నిర్వహణ జరుగుతుంటుంది. అలాగే ఒక్కో గ్రూపులో గరిష్టంగా 50 మంది సభ్యులు ఉండగా, వారి నుంచి నెలసరి వాయిదా కింద కనీసం రూ. 5వేల చొప్పున చిట్టీ లెక్కన కాలపరిమితి 50 నెలలు ముగిసే సరికి రూ. 12 కోట్ల 5 లక్షలకుపైగా వసూలు అవుతుంది. అలా ఒక్కో చిట్‌ఫండ్‌ ద్వారా సాలీనా కోట్లాది రూపాయల టర్నోవర్‌ జరుగుతుంది. కొన్ని చిట్‌ ఫండ్‌లలో చిట్టీల నిర్వహణతోపాటు అక్రమంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

బోర్డులు తిప్పేసిన సంఘటనలెన్నో...!

రిజిస్ట్రేషన్లు కలిగి ఉండి కూడా బోర్డులు తిప్పేసి కోట్లాది రూ పాయల ప్రజల సొమ్ముతో పరారైన కంపెనీలు జిల్లాలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో కొంతకాలం క్రితం విపంచి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట తన కార్యౄకలాపాలు నిర్వహించిన సంస్థ అనంతరం బోర్డు తిప్పేసి, కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో ఉడాయించింది. విపంచి చిట్‌ ఫండ్‌కు రిజిస్ట్రేషన్‌ ఉన్నప్పటికీ ప్రజల డబ్బును తస్కరించడం గమనార్హం. ఈ కంపెనీలో చిట్టీలు వేసిన వందలాది మంది నిట్టనిలువునా మునిగిపోయారు. పోలీస్‌ స్టేషన్లలో కేసులు వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంత వరకు డబ్బులు రాకపోవడంతో వా రంతా దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రిజిష్టర్డ్‌ చిట్‌ ఫండ్‌లో గ్రూపులు ప్రారంభించే ముందుకు ఆ చిట్టీ విలువ మొత్తానికి సరిపడా నగదును ముందుగానే అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సదరు గ్రూప్‌నకు అధికారులు నెంబరు కేటాయిస్తారు. అయితే ఉమ్మడి జిల్లాలో కొందరు వ్యాపారులు కేవలం తమ కంపెనీలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయిస్తూ గ్రూపులకు అనుమతులు తీసుకోకపోవడంతో వినియోగదారులు మోసాల బారిన పడుతున్నారు. 10 గ్రూపులున్న కంపెనీలో కేవలం ఎనిమిదింటికి మాత్రమే అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ నుంచి అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బోర్డులు తిప్పేసిన సమయంలో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలో పదుల సంఖ్యలో ప్రైవేటు చిట్టీ నిర్వాహకులు ప్రజల డబ్బుతో ఉడాయించిన సంఘటనలు ఉన్నాయి.

అచల కంపెనీపై చర్యలు...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బ్రాంచిలు కలిగిన ఉన్న అచల చిట్‌ ఫండ్‌ కంపెనీని ఆదిలాబాద్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ మూ డేళ్ల క్రితం మూసివేశారు. చిట్టీ కాలపరిమితి ముగిసినా నగదు చెల్లింపుల్లో జాప్యాన్ని నిరసిస్తూ బాధితులు ఫిర్యాదులు చేయ డంతో స్పందించిన సంబంధిత అధికారులు మూసివేతకు ఆదేశా లు జారీ చేశారు. అయితే అచల లాగే మరిన్ని కంపెనీలు కూడా ప్రజల డబ్బుతో ఉడాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ప్రజల నడ్డి విరిచి బోర్డులు తిప్పేయక ముందే సంబంధిత అధికారులు ముందస్తు విచారణ చేపట్టాలనే డిమాండ్‌లు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అలాగే ఫిర్యాదులు చేస్తే తప్పా....చిట్‌ఫండ్‌ కంపెనీల నిర్వహణపై ధృష్టిసారిం చడం లేదని, ఇప్పటికైనా చిట్‌ఫండ్‌ కంపెనీలను నిబంధనల మేరకు నడిపేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 30 , 2026 | 11:29 PM