పెద్దలు మందలిస్తున్నారని అచ్చంపేటలో ప్రేమ జంట ఆత్మహత్య!
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:00 AM
పెద్దలు తమను మందలిస్తున్నారనే కారణంతో మనస్తాపం చెంది ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒకే చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణం
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటన
మృతులు ఇద్దరు మైనర్లు
అచ్చంపేట, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పెద్దలు తమను మందలిస్తున్నారనే కారణంతో మనస్తాపం చెంది ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒకే చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో బుధవారం వెలుగు చూసిన ఈ ఘటనలో ప్రశాంత్(16), సువర్ణ(16) అనే మైనర్లు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన దాసరి ముత్యాలు, ఎర్రమ్మ దంపతుల కుమారుడు ప్రశాంత్(16), పదర మండలం చిట్లంగుంట గ్రామానికి చెందిన మల్లయ్య కూతురు సువర్ణ (16) ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. అయితే, ఇటీవల ప్రశాంత్ ఇంటికి సువర్ణ రాగా.. తల్లిదండ్రులు మందలించడంతో ఇరువురు మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో సువర్ణ మంగళవారం కూడా ప్రశాంత్ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రశాంత్, సువర్ణ ఒకే చీరతో గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రశాంత్ సోదరుడు బుధవారం ఉదయం ఇంటి తలుపు తట్టగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బలవంతంగా తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ప్రశాంత్, సువర్ణ విగతజీవులుగా కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు.